Tuesday, April 30, 2024

ఫిబ్రవరి మొదటి వారంలో ‘సెట్స్’ షెడ్యూల్ ?

- Advertisement -
- Advertisement -

ప్రక్రియ ప్రారంభించిన ఉన్నత విద్యా మండలి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ వచ్చేనెల మొదటివారంలో వెలువడే అవకాశం ఉంది. గతేడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, ఈసారి కూడా మొదటి వారం లేదా రెండో వారంలో ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎంసెట్, ఇసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల ప్రక్రియను ఉన్నత విద్యామండలి ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు యూనివర్సిటీలను ఖరారు చేసి, ఆయా సెట్లకు కన్వీనర్ల నియామకం కోసం యూనివర్సిటీలకు లేఖలు రాసినట్లు తెలిసింది. యూనివర్సిటీలు తమ పరిధిలోని సెట్‌కు కన్వీనర్‌ను నియమించేందుకు ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సిఫారసు చేస్తే అందులో ఒకరిని ఆయా సెట్‌లకు కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి నియమించనుంది. ఈసారి సెట్ల కన్వీనర్లు కొంతమంది మారనున్నట్లు సమాచారం.
మే నెలలో ఎంసెట్..?
వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) మే లేదా జూన్‌లో నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను మే నెలలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనలకు అనుగుణంగా సెట్స్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జెఇఇ మెయిన్‌కు కూడా హాజరవుతారు కాబట్టి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి నిర్ణయించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News