Tuesday, May 14, 2024

స్కూల్ నుంచి తిరిగిరాని లోకాలకు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : స్కూల్ నుంచి ఇళ్లకు ఆటోలో వెళ్లుతున్న ఏడుగురు బాలలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని కంకెర్ జిల్లాలోని కోరార్ గ్రామం కూడలిలో భానూప్రతాప్‌పూర్ వద్ద గురువారం జరిగింది. జిల్లా ఎస్‌పి షలాభ్ సిన్హా ఘటన వివరాలు విలేకరులకు తెలిపారు. ఎనమండుగురు పిల్లలు స్కూలు నుంచి ఆటోలో వెళ్లుతుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఆటోడ్రైవరు, ఓ చిన్నారి తీవ్రంగా గాయపడగా, మిగిలిన పిల్లలు నుజ్జునుజ్జు అయ్యారు. ఆటో సరైన కండిషన్‌లో లేదని, ఉన్నట్లుండి డ్రైవర్ రాంగ్ సైడ్‌లో వెళ్లడంతో అటు వైపు వస్తున్న ట్రక్కు ఢీకొందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎక్కువ మంది పిల్లలను ఆటోలో తీసుకుని నిర్లక్షంగా నడపడం ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పిల్లల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

కొందరు ట్రక్కు టైర్ల కింద చిక్కుపడ్డారు, మరికొందరు పల్టీలు కొట్టిన ఆటోలో చాలా దూరం వరకూ గాయాలతో అరుస్తూ ప్రాణాలు కోల్పోయ్యారు. పిల్లలు మృతి చెందారనే వార్త తెలియగానే అక్కడికి తరలివచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, స్కూలు టీచర్ల ఆవేదనలు రోదనలతో ఈ ప్రాంతం అంతా విషాదభరితం అయింది. ఈ ఘటన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన పిల్లలు నాలుగు నుంచి ఏడేళ్ల లోపువారే. అక్కడి బిఎస్‌ఎన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News