Friday, April 26, 2024

దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’

- Advertisement -
- Advertisement -

Severe damage with Amphon storm

 

బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు
పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక
బెంగాల్, ఒడిశా అప్రమత్తం
సురక్షిత ప్రాంతాలకు లక్షల మంది తరలింపు
రెండు రాష్ట్రాలకు 41 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
కేంద్రమంత్రి అమిత్ షా సమీక్ష

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఎంఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. పశ్చిమ , మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న పెనుతుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తరంగా పయనించి బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరాన్ని దాటనుందని ఐఎండి తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో బుధవారం మధ్యాహ్నంనుంచి సాయంత్రం వరకు గంటకు 155165 కిలోమీటర్లవేగంతో పెనుగాలులు వీచవచ్చని, గరిష్ఠంగా 185 కిలోమీటర్ల వరకు భీకర గాలులు వీచే అకాశం ఉందని తెలిపింది.ఈ సమయంలో ఎంఫాన్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పూరిళ్లు, పురాతన కట్టడాలకు ప్రమాదం ఉంటుందని, కమ్యూనికేషన్, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని తెలిపింది.

తాటి, కొబ్బరి చెట్లు ఎక్కువగా కూలిపోయే అవకాశముందని, పడవలు, ఓడలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రంలో అలలు 56మీటర్ల దాకా ముందుకు దూసుకు రావచ్చని తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈదురు గాలులు వీచే సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్‌కతా జిలాల్లో ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. తుపాను వల్ల కలిగే నష్ట గతంలో 2019 నవంబర్ 9న పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకిన ‘బుల్‌బుల్’ తుపానుకన్నా ఎక్కువే ఉండవచ్చని పేర్కొంది. తుపాను కారణంగా ఒడిశా తీరప్రాంత జిల్లాలయిన జగత్‌సింగ్‌పూర్,కేంద్రపారా, భద్రక్, జయపూర్, బాలాసోర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బెంగాల్, ఒడిశా అప్రమత్తం

ఈ నేపథ్యంలో తుపాను దృష్టా తీసుకొన్న సన్నద్ధత చర్యలను ఒడిశా చీఫ్ సెక్రటరీ, పశ్చిమ బెంగాల్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎన్‌సిఎండికి వివరించారు. రెండు రాష్ట్రాలు కూడా తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న జిల్లాల్లోని తీరప్రాంతాలనుంచి 3లక్షల మందిని తరలించింది. అవసరమైతే మరింత మందిని తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. మరో వైపు మంగళవారం సాయంత్రంనుంచే ఎంఫాన్ ఒడిశా తీరప్రాంత జిల్లాల్లో ప్రభావం చూపిస్తోంది. అనేక చోట్ల సముద్రపు అలలు ఎగసి పడుతూ ఉండగా, పలు చోట్ల అలల తాకిడికి పడవలు కొట్టుకు పోతుండడంతో వాటిని కాపాడుకొవడానికి జాలర్లు అష్టకష్టాలు పడుతున్నారు.

తుపాను తీరం దాటే వరకు కంట్రోల్ రూమ్‌లోనే సిఎం..

ఇదిలా ఉండగా ఎంఫాన్ పెను తుపాను తీరం దాటే వరకు అంటే బుధవారం దాకా రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లోనే ఉండి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు.

రెండు రాష్ట్రాల్లో 41 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు

ఇదిలా ఉండగా ఎంఫాన్ తుపాను దృష్టా ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఈ రెండు రాష్ట్రాల్లో 41ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను నియమించినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ చీఫ్ ఎన్ ప్రధాన్ విలేఖరులకు చెప్పారు. ఓ వైపు దేశం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న సమయంలోనే ఎంఫాన్ పెను తుపాను రావడంతో దేశం రెండు విపత్తులను ఒకే సారి ఎదుర్కోవలసి వస్తోందని ప్రధాన్ అంటూ, తుపానును నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఫాని’ తుపానును ఎదుర్కొన్న అనుభవంనుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ ఎంతో నేర్చుకుందని ఆయన చెప్పారు. తమ బృందాల వద్ద వైర్‌లెస్ సెట్లు, శాటిలైట్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

గత ఇరవై ఏళ్లలో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో పెను తుపాను ఇదే కావడం గమనార్హం. తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న టెలికాం కార్యదర్శి అన్షుప్రకాశ్ హెచ్చరించారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలనుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి స్థానిక భాషలో ఉచితంగా ఎస్‌ఎంఎస్ సమాచారాన్ని అందజేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

అమిత్ షా సమీక్ష

ఎంఫాన్ పెను తుపానును ఎదుర్కోవడానికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. తుపానును సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తుందని ఆయన వారికి హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News