Saturday, May 4, 2024

అణగారిన వర్గాల మహిళలకే లైంగిక హింస ముప్పు

- Advertisement -
- Advertisement -

Sexual violence is threat to women from oppressed communities

 

హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై యుఎన్ ఆందోళన

న్యూఢిల్లీ : భారత్‌లో మహిళలు, బాలికలపై లైంగిక హింస పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితి(యుఎన్ ఇన్ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాజికంగా అణగారిన వర్గాలకు లింగ వివక్ష ప్రాతిపదికన హింసకు గురయ్యే ప్రమాదం అధికంగా పొంచి ఉందనడానికి ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్, బలరాంపూర్‌లో జరిగిన అత్యాచారం, హత్య సంఘటనలే నిదర్శనమని ఐక్య రాజ్య సమితి ఇండియా శాఖ వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటనలకు బాధ్యులైన నిందితులకు త్వరితంగా శిక్షపడేలా చూసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం, సామాజిక మద్దతు, ఆరోగ్యపరమైన రక్షణ, పునరావాసం లభించేలా చర్యలు తీసుకోవాలని యుఎన్ సోమవారం ఒక ప్రకటనలో కోరింది.

ఇటీవల కాలంలో భారతదేశంలో మహిళలు, బాలికల సాధికారిత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ సామాజికంగా అణగారిన వర్గాలు మాత్రం లింగ వివక్షతతో కూడిన హింసకు గురవుతున్నారని, ఇందుకు హత్రాస్, బలరాంపూర్ సంఘటనలే నిదర్శనమని యుఎన్ పేర్కొంది. మహిళలు, బాలికల భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్వాగతిస్తున్నామని, అయితే వాటిని మరింత వేగంగా అమలు చేయాలని యుఎన్ కోరింది. హత్రాస్, బలరాంపూర్ ఘటనలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపును తాము బలపరుస్తున్నామని, అయితే అణగారిన వర్గాల పట్ల లింగ వివక్షతతో కూడిన హింసకు పాల్పడిన పురుషులు, బాలుర ప్రవర్తన, సామాజిక వాతావరణంపై కూడా దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని యుఎన్ పేర్కొంది.

మహిళలపై హింసను నిరోధించడానికి ప్రభుత్వం, పౌర సమాజం చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని యుఎన్ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏ విధంగా కృత నిశ్చయంతో పోరాడుతున్నామో అదే విధంగా లింగ వివక్ష లేని సమాజ స్థాపన కోసం అదే విధంగా పోరాడాల్సిన అవసరం ఉందని యుఎన్ తెలిపింది. కాగా.. హత్రాస్, బలరాంపూర్‌లో ఇద్దరు బాలికల హత్యాచార ఘటనలపై యుఎన్ ఇన్ ఇండియా చేసిన ప్రకటనను తాము సంపూర్ణంగా బలపరుస్తున్నామని యుఎన్ వుమెన్ భారత ఉప ప్రతినిధి, ఆఫీసర్ ఇన్‌చార్జి నిష్టా సత్యం తెలిపారు. ఈ నీచమైన, అమానుషమైన చర్యలను తాము నిర్దంద్వంగా ఖండిస్తున్నామని, నిందితులను త్వరితంగా అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News