Sunday, April 28, 2024

కింగ్ ఈజ్ బ్యాక్..

- Advertisement -
- Advertisement -

Shower of praise on Dhoni on ipl qualifier innings

ధోనిపై ప్రశంసల వర్షం

దుబాయి: ఐపిఎల్ సీజన్14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కీలక సమయంలో ధోని ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఢిల్లీపై ధోని విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరు బంతుల్లోనే అజేయంగా 18 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, మరో మూడు బౌండరీలు ఉన్నాయి. 19వ ఓవర్‌లో అతను కొట్టిన సిక్స్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. ఇక టామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్‌లోనూ మూడు ఫోర్లు కొట్టి మరో రెండు బంతులు మిగిలివుండగానే సిఎస్‌కెను గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో రుతురాజ్, ఉతప్పలతో పాటు ధోని ఆడిన ఇన్నింగ్స్ ఐపిఎల్ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్‌లో ధోని అంతంత మాత్రం బ్యాటింగ్‌నే కనబరిచాడు. అతని బ్యాటింగ్ టెస్టులను తలపించింది. ఇక అతని పని అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం అసన్నమైందని నెటిజన్లు, పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో ట్విట్‌లు చేశారు. అయితే ఢిల్లీపై ధోని ఆడిన ఇన్నింగ్స్ తర్వాత వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని చెప్పక తప్పదు. తాను మ్యాచ్ ఫినిషర్ అనే విషయాన్ని ధోని మరోసారి నిరూపించాడు.

అదిరి పోయే ఇన్నింగ్స్ ఇది..

ఇక మహేంద్ర సింగ్ కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలీలో స్పందించాడు. ధోని కొట్టిన ప్రతి షాట్‌ను ఆస్వాదించిన కోహ్లి మ్యాచ్ ముగిసిన వెంటనే కేరింతలు కొట్టాడు. అంతేగాక కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ట్విట్ చేశాడు. ప్రపంచ క్రికెట్‌లోనే ధోని అతి గొప్ప ఫినిషర్. అతని బ్యాటింగ్ అంటే నాకెంతో ఇష్టం. మరోసారి నన్ను కూర్చుకున్న సీట్‌లో నుంచి ఎగిరి గంతేసేలా చేశాడని కోహ్లి కొనియాడాడు. ధోని బ్యాటింగ్ ఎంతో అద్భుతంగా ఉంది. ఒత్తిడిలోనూ దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. అతని బ్యాటింగ్ గురించి చాలా మంది విమర్శలు గుప్పించారు.

అందరికి తన బ్యాట్‌తోనే ధోని సమాధానం చెప్పాడని అతని మాజీ సిఎస్‌కె సహచరుడు మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ధోని బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. కీలక సమయంలో ధోని జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది. కానీ ధోని మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తాను మ్యాచ్ ఫినిషర్ అనే విషయాన్ని మరోసారి చాటాడని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ యజమానురాలు ప్రీతి జింటా, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, గంభీర్ తదితరులు కూడా ధోని బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News