Saturday, April 27, 2024

విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేటది మొదటిస్థానం

- Advertisement -
- Advertisement -

తర్వాతి స్థానాల్లో వరుసగా గజ్వేల్, హైదరాబాద్ సౌత్‌లు
ఈ బిల్లులు కట్టించే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలదే….
మైనార్టీల సంక్షేమం గురించి మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు
ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్:  విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేటది మొదటి స్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా గజ్వేల్, హైదరాబాద్ సౌత్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌రంగ పరిస్థితిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే అక్భరుద్దీన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ముస్లింల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సిఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం తమకు మరోకరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలని సిఎం సూచించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎంఐఎం పార్టీ భాగస్వామ్యం కాదా..? అని రేవంత్ ప్రశ్నించారు. మైనార్టీలను సిఎం, పిసిసి అధ్యక్షుడిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు. ఎంఐఎం కూడా అధికారంలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుందన్నారు. ఓ దళిత ఎమ్మెల్యేలను అక్బరుద్దీన్ అవమానించడం సరికాదని సిఎం సూచించారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీతో ఎంఐఎం దోస్తీ!
మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది తామేనని, మీ మిత్రుడు కెసిఆర్ 12 శాతం ఇస్తానిని ఇవ్వనేలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీతో ఎంఐఎం పార్టీ కలిసి ఉంటుందని రేవంత్ ఆరోపించారు. ఎంఐఎం పార్టీ కెసిఆర్‌కు మిత్రుడు కావచ్చు.. మోడీకి మద్దతు ఇవ్వచ్చు… వాళ్ల ఇష్టమని సిఎం పేర్కొన్నారు. సిఎంగా నాదెండ్ల మనోహర్ ఉన్నప్పుడు ఆయనతో ఎంఐఎం దోస్తీ చేసింది. ఎన్‌టిఆర్‌తో, చంద్రబాబుతోనూ ఎంఐఎం దోస్తీ చేసింది. ఇప్పుడు కెసిఆర్, కెటిఆర్‌తోనూ దోస్తీ చేస్తుందని సిఎం ఎద్దేవా చేశారు. అలాగే కెసిఆర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో కూడా చర్చ చేద్దామని, ఎవరెవరు ఎక్కడ నుంచి వచ్చారో చర్చ చేద్దామంటే ఒకరోజు చర్చ పెడదామంటూ సిఎం రేవంత్ సవాల్ విసిరారు.
విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత కెసిఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్‌లదే….
విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత కెసిఆర్, హరీశ్ రావు, అక్బరుద్దీన్‌కు ఉందని, ఆ బకాయిలు చెల్లిస్తే సంస్థ నష్టాల నుంచి బయటపడుతుం దని సిఎం సూచించారు. గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ ఉంటే వినేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే చదువుతున్న అక్బరుద్దీన్‌కు ఆ ప్రభుత్వం లోపాలు కనిపించలేదా అని సిఎం నిలదీశారు. తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఆ పార్టీ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు.
సిద్దిపేటలో 61.37 శాతం బిల్లుల ఎగవేత
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేటది మొదటి స్థానమని, గజ్వేల్‌ది రెండో స్థానం, హైదరాబాద్ సౌత్‌ది మూడో స్థానమని, సిద్దిపేటలో 61.37 శాతం, గజ్వేల్‌లో 50.29 శాతం, హైదరాబాద్ సౌత్‌లో 43 శాతం విద్యుత్ బకాయిలు ఉన్నాయని సిఎం రేవంత్ చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లలో తెలంగాణను పాలించారని రేవంత్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్, ఎంఐఎం వేరు కాదని, ఇద్దరూ కలిసే పాలించారని సిఎం రేవంత్ గుర్తు చేశారు. తాను విద్యుత్ బకాయిల గురించి మాట్లాడితే, అక్బరుద్దీన్ ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విషయాన్ని పక్క దోవ పట్టిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కు టికెట్ ఇస్తే అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల, గజ్వేల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్‌కు పోటీ చేసేందుకు కామారెడ్డి మాత్రమే దొరికిందా అని రేవంత్ నిలదీశారు. షబ్బీర్ అలీని ఓడించాలని కెసిఆర్ కామారెడ్డి ఎంచుకున్నారన్నారని రేవంత్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలని సిఎం హితవు పలికారు. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమేనని, ఆయనను తాము ముస్లిం ప్రతినిధిగా చూడడడం లేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే తమకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదని రేవంత్ పేర్కొన్నారు. చాంద్రాయణగుట్టలో ఉన్న హిందువులు అక్బరుద్దీన్‌కు ఓటు వేశారని రేవంత్ గుర్తు చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శ్రీశైలం విద్యుత్ సొరంగంలో బ్లాస్ట్
బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్ రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్ 01న తేదీన సబ్ స్టేషన్‌లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి ఆయనకు గుర్తుచేస్తున్నానని సిఎం రేవంత్ తెలిపారు. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బిఆరెస్ పాలనలోనేనని ఆయన పేర్కొన్నారు. కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది కూడా వారి పాలనలోనేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది దుర్మరణం చెందారని ఈ ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ ఆదుకుందన్నారు. కానీ, ఆనాటి సిఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదని సిఎం రేవంత్ ఆరోపించారు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదన్నారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కెసిఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసనీ, ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దామని, ప్రస్తుతం విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చించాలని సిఎం సూచించారు. ఎంఐఎం పార్టీ సభ్యులు విలువైన సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News