Tuesday, May 7, 2024

టిఎస్ బిపాస్‌పై విస్తృత ప్రచారం చేయాలి

- Advertisement -
- Advertisement -

TS B pass

 

మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ల మంజూరుకు ఆధునిక సాంకేతిక పద్దతి… తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టిఎస్ బిపాస్ )పై విస్తృత ప్రచారాన్ని జరపాలని అన్ని మున్సిపల్ కమిషనర్‌లకు పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది. కొత్త మున్సిపల్ చట్టం 2019 ప్రకారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ పద్దతి, 21 రోజుల్లో అనుమతుల మంజూరు, సింగిల్ విండో విధానంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కమిషనర్‌లకు పురపాలక శాఖ స్పష్టంచేసింది.

ఈ నెల 12వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎస్ బిపాస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పురపాలక విభాగం అధికారులను ఆదేశించారు. వచ్చే ఏప్రిల్ 2వ తేదీ నుంచి టిఎస్ బిపాస్ పద్దతిని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురావాలని, ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు పరుస్తున్న 10 మున్సిపాలిటీల్లో ఎదురవుతోన్న సవాళ్ళను పరిగణలోకి తీసుకుని మరిన్ని మార్పులు చేర్పులు చేసి ఏప్రిల్ 2వ తేదీన పూర్తిగా కార్యరూపంలోకి తీసుకురావాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

అనుమతులు, చర్యలు ఇలా…
టిఎస్ బిపాస్ పద్దతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు, అనుమతులు లేకుండా చేసే నిర్మాణాలపై, లేఅవుట్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఉంటుంది. 75 చ.గ.లు వరకు ఉన్న ప్లాటులో నిర్మించే ఇండ్లకు అనుమతులు అవసరంలేదు. 500 చ.మీ.లు వరకు, 10 మీ.ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్(స్వీయ ధృవీకరణ పత్రం)ను సమర్పించడం ద్వారా వెంటనే అనుమతులు పొందవచ్చును.

సింగిల్ విండో పద్దతిలో 10 మీ.లు ఎత్తుకుపైబడిన అన్నిరకాల భవనాలకు, నివాసేతర భవనాలకు అనుమతులను 21 రోజుల్లోనే పొందే సౌలభ్యం టిఎస్ బిపాస్ పద్దతిలో ఉంటుంది. 7 మీ.ల ఎత్తుండే 200 చ.మీ.ల విస్తీర్ణంలోని భవనాలకు మార్టిగేజ్ అవసరం లేదు. దరఖాస్తు చేసిన అనంతరం పరిశీలన పూర్తిగా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లాస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. దరఖాస్తుదారులు వాస్తవాలను కప్పిపుచ్చుతే అందుకు జరిమానాలు విధించడం, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు జరిగితే ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లోనే స్వీయ ధృవీకరణ పత్రం అందజేయడం ద్వారా మంజూరు చేస్తారు.

దరఖాస్తుల పరిశీలన ఇలా…
సింగిల్ విండో ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ పద్దతిలో అందిన దరఖాస్తులను పంచాయత్ రాజ్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ లేదా అతని తరపున అధికారి దరఖాస్తు టైటిల్ డీడ్‌ను పరిశీలిస్తారు. దరఖాస్తుకు చెందిన భూమిని భౌగోళికంగా నీటిపారుదల విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ లేదా ఆ అధికారి తరపున మరో అధికారి తనిఖీ చేస్తారు. రోడ్లు, భవనాల విభాగానికి చెందిన ఎస్‌ఇ లేదా ఆయన తరపున అధికారి దరఖాస్తు సాంకేతికపరమైన అంశాలను పరిశీలించి స్క్రూట్నీ చేస్తారు. ఈ పద్దతి ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, మంచిర్యాల్, ఫీర్జాదీగూడ వంటి 10 మున్సిపాలిటీల్లో ఈ పద్దతి విజయవంతంగా నడుస్తున్నది.

ప్రచారం చేయాలంటూ…
టిఎస్ బిపాస్ విధానంలో అనుమతులు మంజూరు, తీసుకునే చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, డయాల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని స్థానిక టివి ప్రసారాల్లో, ప్రతి 15 రోజులకొకమారు స్లాట్ తీసుకుని టివిల్లో ప్రచారం చేయాలని, స్క్రోలింగ్ చేయడం, స్థానిక చానల్లో ప్రకటనలు వెలువరించడం, కరపత్రాలు ఆంగ్లం, తెలుగుల్లో రూపొందించి పంచడం చేయాలని, అధిక శాతం దరఖాస్తులు టిఎస్ బిపాస్ పద్దతిలోనే సమర్పించేలా చూడాలని కలెక్టర్‌లకు, అదనపు కలెక్టర్‌లకు, స్థానిక సంస్థల యంత్రాంగానికి, కమిషనర్‌లకు పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది.

Single Window Method in TS B pass
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News