Friday, April 26, 2024

శ్రీశైలం 2గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Srisailam Reservoir gates lifted

 4లక్షల65వేల క్యూసెక్కులు వచ్చి చేరిక
 882 అడుగులకు చేరిన నీటిమట్టం
 నాగార్జున సాగర్‌కు 20వేల క్యూసెక్కులు విడుదల
జూరాల వద్ద కృష్ణ, తుంగభద్ర నదులకు వరద ఉధృతి
జూరాలకు 3 లక్షల 82వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సుంకేసులకు 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండుకుంది. దీంతో అధికారులు బుధవారం రాత్రి ఏడు గంటలకు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు స్పిల్ వే ద్వారా 53వేల 488 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి శ్రీశైలం దేవస్థాన ఈఓ కెఎస్ రామారావు, శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో గంగా హారతి, పూజా కార్యక్రమాలు నిర్వహించి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం గంగా హారతి ఇచ్చి రెండుగేట్లను పది అ డుగుల మేర ఎత్తి ఈ సీజన్‌లో మొదటిసారిగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల,తుంగభద్ర నదుల నుంచి 4 లక్షల 62వేల 537 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 885 అడుగులకు గానూ 882.10 అడుగుల మేరకు నీరు చేరుకున్నాయి. 215 టిఎంసీలకు గానూ 199.7754 టిఎంసీల మేర నీరు నిల్వ ఉంది. వరద ఉధృతంగా ఉండడంతో అధికారులు ముందస్తుగా ఎగువ నుంచి వస్తున్న వరదను ఆధరంగా చేసుకొని దిగువకు నీటిని వదులుతున్నారు.

రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తడం ద్వారా 53వేల 488 క్యూసెక్కులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 67వేల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. జూరాల నుంచి 3లక్షల 84వేల క్యూసెక్కులు, తుంగభద్ర నదిపై గల సుంకేసుల నుంచి 79వేల 23 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ నుంచి 3 లక్షల 82వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 41 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 3లక్షల 82వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా తుంగభద్ర నది నుంచి వస్తున్న వరదను తెలంగాణలోని సుంకేసుల డ్యాం 31 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 80వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్ణాటకలోని అలమట్టి ప్రాజెక్టుకు 4 లక్షల 13వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 3 లక్షల 40వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. అదే విధంగా నారాయణపూర్‌కు 3 లక్షల 38వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 3 లక్షల 37వేల ఔట్‌ఫ్లో నమోదైంది. తుంగభద్రకు లక్షా 2వేల 240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 80వేల 250 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. కృష్ణా,తుంగభద్ర నదులకు భారీ వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను విడుతల వారిగా ఎత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News