Friday, May 3, 2024

కుల గణనకు దన్ను

- Advertisement -
- Advertisement -

బీహార్ కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఒక ప్రధాన అంశం మరొక అడుగు ముందుకు జరిగిందని భావించాలి. ఈ కుల గణన మూలంలో సామాజిక అశాంతి, ఆందోళనలు వున్నాయని అంగీకరించక తప్పదు. ఎందుకంటే దేశ జనాభాలో అత్యధిక శాతం అణగారిన వర్గాల వారే కావడం, ఎన్నేళ్ళు గడిచినా వారి పరిస్థితి మెరుగుపడకపోడంతో వారు ఆయా కులాల స్థితిగతులను బట్టి వారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరడం ప్రారంభించారు. అదే సమయంలో కింది వర్గాలు రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వోద్యోగాలు పొందుతున్నారని, వెనుక వరుస నుంచి ముందుకు దూసుకొచ్చి తమకు చెందాల్సిన ఫలాలను కాజేస్తున్నారనే అసంతృప్తితో అగ్ర వర్ణాలు ఆందోళనలు చేపట్టే వరకు పరిస్థితి వెళ్ళింది. దీనితో ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 10% కోటాను కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగం సామాజిక, విద్యా విషయక వెనుకబాటుతనాన్నే గుర్తించి అటువంటి స్థితిలోని ఎస్‌టి, ఎస్‌సి, బిసి వర్గాలకు రిజర్వేషన్లను కల్పించింది. అందుచేత ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు చెల్లవనే వాదన బయలుదేరింది.

ఆర్థిక రిజర్వేషన్లు అగ్ర వర్ణాల ఆందోళనలకు తెర దించిన మాట వాస్తవం. అయితే ఆర్థిక రిజర్వేషన్ల కల్పన సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలలో అసంతృప్తికి బీజం వేసింది. అది పెరిగి పెరిగి కుల జన గణన ద్వారా ఎవరు ఎంత మందో తేల్చాలని ఈ వర్గాలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అటువంటి లెక్కల సేకరణ వల్ల తాము అగ్ర వర్ణాల మంచి కోసం మాత్రమే పని చేస్తున్నామనే అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో కలిగి తమకు హాని చేస్తుందని బిజెపి భయపడుతున్నది. వాస్తవానికి దానికి ప్రధానమైన మద్దతుదార్లు బిసిలే. ఆ వర్గానికి తన నిజ స్వరూపాన్ని తెలియజేసే కుల గణన వల్ల తీవ్రంగా దెబ్బ తింటానని అది భావిస్తున్నది. ఈ నేపథ్యమే కుల గణన డిమాండ్‌పై ఎన్‌డిఎ ప్రభుత్వం మౌనం పాటించడానికి కారణమైంది. అందుచేత తన రాష్ట్ర స్థాయిలో కుల గణనను జరిపించడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడుం బిగించారు. ఆయన ఎన్‌డిఎ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే అప్పటి బీహార్ ప్రతిపక్ష పార్టీ (ఆర్‌జెడి) నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను వెంట బెట్టుకొని నితీశ్ కుమార్ ప్రధాని మోడీని కలిశారు. కుల జన గణనను జాతీయ స్థాయిలో జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కాని మోడీ తనకు బాగా అలవాటైన మౌనాన్నే పాటించారు. వాస్తవానికి దేశంలో కులపరమైన గణన జరిగి చాలా కాలమైంది.

గతంలో చిట్టచివరి సారి బ్రిటిష్ హయాంలో 1931లో కులాల వారీ జనాభా లెక్కలు సేకరించారు. మండల్ కమిషన్ సిఫార్సులకు దానినే ప్రాతిపదికగా తీసుకొన్నారు. యుపిఎ ప్రభుత్వం 201112 లో సామాజిక, ఆర్థిక, కుల జన గణనను జరిపించింది. కాని ఆ వివరాలు గోప్యంగానే వుండిపోయాయి. ఇప్పుడు న్యాయమూర్తులు కె వినోద్ చంద్రన్, పార్థసారథిల ద్విసభ్య ధర్మాసనం బీహార్ కుల గణనకు వ్యతిరేకంగా దాఖలైన అయిదు పిటిషన్లపై మొన్న మంగళవారం నాడు తీర్పు ఇస్తూ కులాల సర్వే సమంజసమేనని స్పష్టం చేసింది. ఎవరి భయాలు ఏమైనప్పటికీ అటువంటి సర్వే జరిపించడం వల్ల కొంపలు మునుగుతాయనే అభిప్రాయాన్ని మాత్రం పూర్తిగా సమర్థించలేము.

కుల సమాజంలో కుల గణన ఎందుకు అపచారమవుతుంది? మూసి వున్న గుప్పెటను తెరిచినందువల్లనే పారదర్శకతకు అవకాశం కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో దాని అవసరమెంతో వుంది. పాట్నా హైకోర్టు గత తాత్కాలిక తీర్పులో కుల పరమైన జన గణన జనాభా లెక్కల సేకరణ కిందికే వస్తుందని, ఆ అధికారం కేంద్రానికే తప్ప రాష్ట్రాలకు లేదని అభిప్రాయపడింది. తాజా తీర్పులో నితీశ్ ప్రభుత్వం జరిపిస్తున్న కుల గణన పకడ్బందీగా వున్నదని అభిప్రాయపడింది. సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధికి అది దోహదం చేస్తుందని పేర్కొన్నది. అనివార్యమైన జనహితానికి అవసరమైన చర్య కాబట్టి ఈ గణన జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. బీహార్ ప్రజలు తెలియజేస్తున్న తమకు సంబంధించిన సమాచారం వారు స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నదేనని పేర్కొన్నది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళకుండా వుండరు. అక్కడ కూడా కుల గణన ఆమోదాన్ని పొందితే అది దేశ వ్యాప్తంగా చోటు చేసుకొనే అవకాశాలు కలగవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News