Tuesday, May 7, 2024

కోటలో తెలు‘గోడు‘

- Advertisement -
- Advertisement -

Students

 

బిస్కెట్లు తిని బతుకుతున్నాం సార్… మమ్మల్ని తీసుకెళ్లండి

రాజస్థాన్‌లోని కోట పట్టణంలో కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్న మన విద్యార్థుల ఆక్రందన
తెలుగు రాష్ట్రాల సిఎంలకు కన్నీటి విజ్ఞప్తులు
హాస్టళ్లు మూసివేశారు… తిండి లేక తిప్పలు పడుతున్నామని ఆవేదన

మనతెలగాణ/హైదరాబాద్ : కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో రాజస్థాన్ లో దాదాపు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిలో తెలంగాణ, ఎపి విద్యార్థులున్నారు. నీట్ ఐఐటి కోచింగ్ కోసం కోటకు వెళ్లిన సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు వివిధ వసతి గృహాల్లో ఉంటూ తాము తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నట్లు వీడియోలు ద్వారా తెలియజేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం హాస్టళ్లు మూసివేశారనీ, తమను వెళ్లిపోవాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో తినడానికి ఏం దొరక్క బిస్కెట్లు తిని ఉంటున్నామని తెలుపుతూ తమ ఆవేదనతో కూడిన వీడియో సందేశాన్ని తెలుగు రాష్ట్రాల సిఎంలకు పంపించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థుల్ని తీసుకెళ్లాయనీ.. తమను కూడా స్వరాష్ట్రాలకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సిఎంలు కెసిఆర్, జగన్‌లను కోరారు.

రాజస్థాన్ లోని కోటా పట్టణం మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కోచింగ్ తీసుకునేందుకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలి వస్తుంటారు. అయితే లాక్ డౌన్ విధించడంతో అనేక రాష్ట్రాల విద్యార్థులు కోటాలో చిక్కుకుపోయారు. యూపి తమ విద్యార్థుల కోసం కోటాకు పెద్ద ఎత్తున బస్సులను పంపింది. ఈ నేపథ్యంలో, కోటాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా హాస్టళ్లు మూసివేయడంతో తినడానికి సరైన తిండి కూడా లేదని, బిస్కెట్లు తింటూ కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఇతర రాష్ట్రాలు కొన్ని తమ విద్యార్థులను స్వరాష్ట్రాలకు తరలించాయని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమను తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగు విద్యార్థులు ఓ వీడియో విడుదల చేశారు. అందులో పలువురు విద్యార్థినులు దీనంగా వేడుకోవడం కలచివేస్తోంది.

 

Student Problems in Rajasthan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News