Sunday, April 28, 2024

యోగి రాముడు కాదు రావణుడు!

- Advertisement -
- Advertisement -

Yogi

 

లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్‌ను శ్రీరాముడిగా, తనను తాను ఆంజనేయుడిగా పోల్చిన సునీల్ సింగ్ తాజాగా యోగిని రావణాసురుడిగా సంబోధించారు. యుపిలో విద్యార్థులు, రైతులు, మహిళలను మోసం చేసిన బిజెపిని సర్వనాశనం చేస్తానని సునీల్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు. యోగితో విభేదాలు రావడంతో 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందూ యువ వాహిని నుంచి సునీల్ సింగ్‌ని యోగి ఆదిత్యనాథ్ బర్తరఫ్ చేశారు.

ఆ తర్వాత హిందూ యువ వాహిని జాతీయ అధ్యక్షుడిని తానేనంటూ సునీల్ ప్రకటించిన దరిమిలా ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద జైలుకు కూడా ప్రభుత్వం పంపించింది. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత హిందూ యువ వాహిని(భారత్) పేరుతో కొత్త సంస్థను సునీల్ స్థాపించారు. శనివారం సమాజ్‌వాది పార్టీలో చేరిన సందర్భంగా సునీల్ ప్రసంగిస్తూ 2022లో జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది ఎస్‌పి ప్రభుత్వమేనని, బిజెపి విధానాలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. యోగిని రావణుడితో పోల్చిన సునీల్ ఈ సందర్భంగా రామచరితమానస్‌లోని ఒక అధ్యాయాన్ని వివరించారు. సీతను అపహరించాలని రావణుడు నిర్ణయించుకున్నపుడు అతను కాషాయం ధరించాడని, అదే తరహాలో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రూపంలో రావణుడు తిరిగి పుట్టాడని సునీల్ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్షలాది ప్రజల కలలను హత్యచేసిన హంతకురాలిగా ఆయన అభివర్ణించారు.

Sunil Singh compares Yogi as Ravana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News