Friday, May 10, 2024

త్రిపుర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -
tripura security
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగడానికి ఏమిచేస్తున్నారు?

న్యూఢిల్లీ: త్రిపురలో శాంతిభద్రతలు అధ్వానంగా తయారవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) దాఖలుచేసిన ధిక్కార పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. త్రిపురలో జరుగనున్న స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు చేపట్టిన భద్రత చర్యల గురించి వివరమైన స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా బిప్లబ్ దేబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
“మీరు మీ ప్రాంతాన్ని ఏకాకిని చేస్తున్నారని మేము భావిస్తున్నాము. మేము మీకు గంటన్నర సమయం ఇస్తున్నాము. పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారో పోలీసుల నుంచి, హోం సెక్రటరీ నుంచి వివరాలు తీసుకోండి. ఎన్నికల ఫలితాలు ప్రకటించేంత వరకు ఎలాంటి భద్రతా ఏర్పాటు చర్యలు తీసుకున్నారో తెలుపండి ” అని సుప్రీంకోర్టు త్రిపుర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ పేర్కొంది.
“వివరాలతో మళ్లీ మధ్యాహ్నం 12.45 గంటలకు రండి. నేడు, ఎన్నికల ముందు, ఎన్నికలప్పుడు, ఫలితాలు ప్రకటించేప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారో వివరంగా ప్రకటించండి” అంటూ న్యాయమూర్తి త్రిపుర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలిపారు. ఇదిలావుండగా విచారణకు ముందు టిఎంసి న్యాయవాది త్రిపురలో చోటుచేసుకున్న అనేక హింసాత్మక ఘటనలపై మాట్లాడారు. “పోలీసులు ప్రేక్షకుల మాదిరి నిల్చుంటున్నారే తప్ప ఏమీ చేయడంలేదు. కావాలంటే ఈ స్క్రీన్ షాట్లు చూడండి” అంటూ కొన్ని దృశ్యాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఆరోపణలపై ప్రతిస్పందించిన కోర్టు, త్రిపుర ప్రభుత్వ న్యాయవాది మహేశ్ జెఠ్మాలనీతో “ స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓట్ల లెక్కింపు ఎప్పుడు, నేటి నుంచి కౌంటింగ్ రోజు వరకు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మీరు ఎలాంటి చరలు తీసుకున్నారు?” అని నిలదీసింది. ఈ కేసును న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇదివరలో నవంబర్ 11న టిఎంసి పిటిషన్ విచారించినప్పుడు కూడా “ఏ రాజకీయ పార్టీ ఎన్నికల హక్కులను కాలరాయకుండా, శాంతియుతంగా ప్రచారం చేసుకునే వీలుగా ఉండేలా చూడండి” అని త్రిపుర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శాంతిభద్రత విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారో వివరంగా అఫిడవిట్ దాఖలు చేయమని కూడా కోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News