Sunday, April 28, 2024

బిగ్ హిట్

- Advertisement -
- Advertisement -

 

ఒక రోజు ముందే లక్షాన్ని మించిన ప్యాక్‌లు
ఎంపి సంతోష్ వినూత్న ఆలోచనతో బత్తాయి రైతుకు పండుగ
నేడు వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ బిగ్ బత్తాయి ఫెస్టివల్

మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం బత్తాయి రైతులను ఆదుకుంది. గిట్టుబాటు ధర అందించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతమైంది. తాజాగా రాజ్యసభ సభ్యులు – జోగినపల్లి సంతోష్ పిలుపు మేరకు -వాక్ ఫర్ వాటర్ సంస్థ ఆదివారం తెలంగాణ బిగ్ బత్తాయి ఫెస్టివల్ (బత్తాయి డే) నిర్వహిస్తోంది. కరోనాను ఎదుర్కొవడానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందించడంలో బత్తాయి కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా వాక్ ఫర్ వాటర్ సంస్థ 20 కిలోల బత్తాయిని కేవలం రూ.500 లకే సరఫరా చేస్తోంది. బత్తాయి ప్రియులు 8875351555కు మిస్ట్ కాల్ ఇచ్చి తమ ఆర్డర్‌ను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. ఇప్పుడు ఎంపి సంతోష్ పిలుపు మేరకు 2020 ప్యాక్‌లు అమ్మాలని వాక్ ఫర్ వాటర్ సంస్థ లక్షంగా పెట్టుకుందని నిర్వాహకుడు కరుణాకర్ రెడ్డి తెలిపారు.

అయితే అనుహ్యాంగా శనివారం రాత్రి నాటికే 3100 ప్యాక్‌ల ఆర్డర్ వచ్చినట్లు తెలిపారు. అంటే 62 టన్నుల బత్తాయి. ఆదివారం సాయంత్రాని కల్లా మరో 40 నుంచి 50 టన్నులు ఆర్డర్ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇమ్యూనిటికి బ్రాండ్ అంబాసిడర్ అయిన బత్తాయితో పాటు వినూత్న మార్గాలను ఎంచుకుని రైతుల నుంచి నేరుగా బత్తాయిలు కొనుగోలు చేస్తూ వినియోగదారులకు అందించింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంధ సంస్థ పండ్లను హోం డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇలా రైతులకు మంచి ధర లభించడంతో పాటు, వినియోగదారులకు కూడా నాణ్యమైన బత్తాయి పండ్లు తక్కువ ధరలోనే లభించాయి. దీంతో వినియోగదారులకు ఆరోగ్యం… రైతులకు లాభాలు వచ్చాయి. లాక్‌డౌన్‌తో ఈసారి తెలంగాణ నుంచి ఢిల్లీ, ముంబాయి వంటి రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపోయాయి. దీంతో ఇటీవల మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా బత్తాయి పండ్ల వినియోగం పెంచేలా వ్యాఖ్యాలు చేయడం ఆ రైతులకు కలిసొచ్చింది.

బత్తాయి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కరోనాను ఎదుర్కొనేందుకు తక్కువ ధరలో లభించే బత్తాయిలు తినాలని సిఎం సూచించారు. దీంతో విపరీతంగా వినియోగం పెరిగింది. డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా బత్తాయిలో సి విటమిన్ అధికంగా ఉంటుందని, న్యూట్రిషన్ పండు అని చెబుతున్నారు. రాష్ట్ర ఉద్యాన శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 63 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉన్నాయి. వేసవిలోనే వీటికి సీజన్ ఉంటుంది. దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతి వస్తుంది. సరిగ్గా కోత సమయంలో లాక్‌డౌన్ విధించడంతో మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులు తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎన్నెన్నో ఆరోగ్య లాభాలు

బత్తాయిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. బత్తాయిలోని రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తరుచుగా జ్యూస్ చేసుకుని తాగితే చెడు కొలెస్ట్రెల్‌ను కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. యాంటిఆకిండెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా కడుపులో మంటలు తగ్గుతాయి. ఎముకల పటుత్వానికి, మంచి కంటిచూపుకు, స్కర్వీ నివారణకు బ్రహ్మండమైన ఔషధంగా పనిచేస్తుంది. ఉద్యాన శాఖ నివేదిక ప్రకారం పావు లీటరు (250 మి.లీ) బత్తాయి రసంలో 131 ఎం.జి సి విటమిన్ ఉంటుంది. పోటాషియం 524 ఎం. జి ఉంటుంది.

బత్తాయి రైతులకు బూస్టింగ్

బత్తాయి రైతులకు బూస్టింగ్ ఇచ్చేలా రాజ్యసభ సభ్యులు సంతోష్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మార్కెటింగ్ చేసుకునేందుకు ఎన్నో సౌకర్యాలను కల్పించింది. ఇప్పుడు బత్తాయి డే నిర్వహించడం ద్వారా గిట్టుబాటు ధర కల్పించినట్లవుతుంది. బత్తాయి తిని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి.
ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్. వెంకట్రాంరెడ్డి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News