Sunday, April 28, 2024

మహిళలకు ‘ఆరోగ్య శాఖ’ గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

ఆరోగ్య శాఖ డే న రాష్ట్రవ్యాప్తంగా
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ
లబ్ధిపొందనున్న 6.84లక్షల మంది మహిళలు

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్‌టౌన్ : రాష్ట్రంలో 21రోజుల పాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘ఆరోగ్య శాఖ డే’ రోజున రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయనున్నట్టు ఆ శాఖ ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. 202324లో రాష్ట్రవ్యాప్తం గా ఉన్న 6.84 లక్షల మహిళలు లబ్ధి పొందుతారని, 14 నుంచి 26 వారాల సమయంలో రెండో ఎఎన్‌సి సమయంలో 27 నుంచి 34 వారాల సమయంలో మూడో ఎఎన్‌సి సమయంలో మొత్తం రెండు సార్లు కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

24 జిల్లాలో 111 కేంద్రాల్లో కిట్ల పంపిణీ ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల సంఖ్యకు సరిపడా కిట్లు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. కిట్ల నిల్వ సురక్షితంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కిట్లు పొందేందుకు వచ్చే గర్భిణులు ఇబ్బంది పడకుండా ఉండేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.

కెసిఆర్ కిట్ ఒక అద్భుత పథకం
ఇప్పటికే ప్రారంబించిన కేసీఆర్ కిట్ ఒక అద్భుత పథకం అని, దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందని చెప్పారు. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామని, ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కెసిఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కెసిఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. నాలుగు ఎఎన్‌సి చెకప్స్, కెసిఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు దోహదం చేస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.

9 జిల్లాల్లో విజయవంతంగా అమలు
రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం1.25 లక్షల మంది గర్భిణులకు రెండు ఎఎన్‌సిల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుండటంతో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మిగతా 24 జిల్లాల్లోనూ కిట్స్ పంపిణీని వైద్యారోగ్య శాఖ ప్రారంభించనుందని వెల్లడించారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్‌లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణాల ప్రగతి గురించి మంత్రి హరీష్ రావు జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు మంజూరు చేసినందున, వాటి నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన చోట నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా పల్లె దవాఖానాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. కాగా, కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 80 పని దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 3854000 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని వివరించారు. ఇందులో 2146000 మందికి రీడింగ్ అద్దాలు, 1708000 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశామని అన్నారు.

ఏ చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని మంత్రి హర్షం వెలిబుచ్చారు. ఇప్పటికే దాదాపు తొంభై శాతం స్క్రీనింగ్ పూర్తయినందున కంటి వెలుగు శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఎ.ఎన్.ఎంలను వారివారి సాధారణ విధుల నిర్వహణ నిమిత్తం రిలీవ్ చేయాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాలను మరింత రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తూ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.

కాగా వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు అందించాలని, పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు హితవు పలికారు. సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని అందరికీ అందించేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేత మహంతి పాల్గొనగా, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News