Wednesday, May 1, 2024

మనమే టాప్

- Advertisement -
- Advertisement -

ఐటి ఉద్యోగాల కల్పనలో

బెంగళూరును వెనక్కి నెట్టేశాం..!

202122లో 1.53లక్షల ఉద్యోగాల కల్పన
కర్నాకటలో 1.48లక్షల ఉద్యోగాలే అందుబాటులోకి
దేశవ్యాప్తంగా 4.5లక్షల ఐటి ఉద్యోగాలు
ఒక్క మన రాష్ట్రంలోనే మూడింట ఒకవంతు ఐటి జాబ్స్
సత్ఫలితాలను ఇస్తున్న ప్రభుత విధానాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి ఉద్యోగాల కల్పనలో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 1.53 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించింది. గత ఆర్ధిక సంవత్సరం (20 212022)లో దేశ వ్యా ప్తంగా ఐటి రంగంలో 4.50 లక్షల ఉద్యోగాలను కల్పించగా… అందులో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కేంద్రం కల్పించిన ఐటి ఉద్యోగాలలో 1/3 వంతు తెలంగాణ నుంచే వచ్చాయి. అంటే హైదరాబాద్ నగరం 1.53 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు అయింది. మన తరువాత కర్నాటక రాష్ట్రం ద్వితీయ స్థాయిలో నిలిచింది. ఆ రాష్టం బెంగళూరు పట్టణం నుంచి 1,48,500 మందికి ఉద్యోగాలు కల్పించగా ముంబాయి 54వేలు, పుణే 40,500, చెన్నై 22,500 ఉద్యోగాలను కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో పరిశ్రమల ఏర్పాటులో ప్రపంచంలోనే గమ్యస్థానంగా మారింది.

దీంతో అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ఐ టి కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారింది. ప్రపంచ స్థాయి ఐటి కంపెనీల కార్యకలాపాలకు, డా టా భద్రతకు కేరాఫ్‌గా హైదరాబాద్ నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. దీనికి నిదర్శనం ప్రపంచ ఐటి దిగ్గజం గూగుల్ తన రెండో అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడమే ఇందుకు నిదర్శనం. అ లాగే ఐటి దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్, అమెజాన్ వంటి అనేక ఎంఎన్‌సిలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. కాగా ఐటి రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా దీన్ని రాష్ట్రమంతా విస్తరించాలని తగు చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, తదితర నగరాలలో మౌలిక వసతులను కల్పించి ఐటి హబ్‌లను ప్రారంభించింది. ఐటీ రంగంలో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలను పొందారు. ఐటి రంగంతో పాటు ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ ఆయా సంస్థలను ఏర్పాటయ్యేలా చేసింది.

కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే రాష్ట్రంలో ఐటి రంగం ఇంతగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం సిఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్…ఐపాస్ విధానమే. ఈ విధానం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా టిఎస్..ఐపాస్ ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం కేవలం పదిహేను రోజుల్లోనే జారీ చేస్తోంది. ఫలితంగా పెట్టుబడుదారులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు సైతం పెద్దఎత్తున పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంపై, హైదరాబాద్‌పై నమ్మకంతోనే దిగ్గజ కంపెనీలు కోట్ల రూపాయల పెట్టుబడులను ఇక్కడ పెట్టాయి. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్థానికులకే ఉద్యోగాలు రావాలని ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 95 శాతం ఉద్యోగాలను స్థానికులకే వచ్చేలా చేసింది. గతంలోని రెండు జోన్లను ఏడు జోన్లుగా మార్చింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుచేసి వందలాది నోటిఫికేషన్లను విడుదల చేసింది. సుమారు 110 నోటిఫికేషన్లను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది అంటే ఆశ్చర్యం కలిగినా ఇది వందశాతం నిజం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షా ముప్పై రెండువేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. మరో లక్ష పోస్టుల భర్తీకి సిఎం ఆదేశాలు ఇచ్చారు. ఇలా కొత్తగా వచ్చిన పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ద్విముఖ వ్యూహాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం పరిశ్రమలను రెండు కేటగిరీలుగా విభజించింది. మొదటి కేటగిరీలో పాక్షిక నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 70 శాతం ఉండాలని, నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 50 శాతం ఉండాలని స్పష్టం చేసింది. రెండో కేటగిరీలో పాక్షిక నైపుణ్యం కలవారిని 80 శాతం ఉండాలని, నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 60 శాతం ఉండాలనే నిబంధనలను అమలు చేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News