Tuesday, April 30, 2024

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR

హైదరాబాద్: గ్రామాల ముఖచిత్రం మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచుతున్నామని, ఆసరా పెన్షన్లతో సామాజిక భద్రతను కల్పించామని, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రెండు లక్షల బీమా కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలవాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. గ్రామాల వికాసానికి దశలవారీగా కృషి చేస్తున్నామని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. రెండో విడతలో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టామని, చేతి, కుల వృత్తులకు చేయూత ఇస్తున్నామని, మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు సరఫరా ఇతర మౌళిక వసతులు కల్పిస్తున్నామని కెసిఆర్ వివరించారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 40 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జరిగాయని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ భాగస్వాములయ్యారని, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించారని, హర్షిత, పారిశుధ్య ప్రణాళికలు రూపొందించామన్నారు.

ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటు చేస్తామని, కొద్ది రోజుల్లోనే తెలంగాణలో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటవుతాయన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్ యార్డులకు తరలించాలని, ఈ చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి పచ్చదనం పెంపునకు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, 2020-21లో 23 నుంచి 54 కోట్ల మొక్కలను నాటుతున్నానని, గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యుత్ సంబంధమైన ఇబ్బందులు తొలగించేందుకు పల్లె ప్రగతి ఉపయోగపడిందన్నారు. 12,751 గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, కేటాయించిన నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలని సర్పంచ్‌లకు కెసిఆర్ సూచించారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని వివరించారు.

Telangana Villages Clean-Green with Palle Pragathi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News