Saturday, April 27, 2024

దీపావళి తరువాత కొత్త మద్యం షాపులకు టెండర్లు !

- Advertisement -
- Advertisement -

Tenders for new liquor shops after Diwali

బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ఖరారు ?
భారీగా పెరగనున్న లైసెన్స్ ఫీజులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్త మద్యం పాలసీని కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఎక్సైజ్ శాఖ. దీపావళి తర్వాత దుకాణాలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా రెండేళ్లకోసారి పాలసీ గడవు ముగుస్తుంది. ఈ అక్టోబర్‌తో గడువు ముగియాల్సి ఉండగా డిసెంబర్ వరకు పొడిగించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడినందున పాత లైసెన్స్‌లను పొడిగించాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు నుంచి కొత్త పాలసీ కూడా అమల్లోకి రానుంది. కొత్త పాలసీ విధి, విధానాలను ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నవంబరు 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం అనంతరం కొత్త పాలసీపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభించి వారం రోజులపాటు దరఖాస్తులు స్వీకరించే అవకాశముందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు

గత పాలసీలో రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలుండగా ఈసారి దాదాపు 10 శాతం వరకు దుకాణాలు పెరగనున్నాయి. మద్యం దుకాణాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ చిక్కులు త్వరలో తొలగిపోనున్న నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లకు సంబంధించి గణాంకాలను రూపొందించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఈ రిజర్వేషన్‌లను జిల్లా యూనిట్‌గా తీసుకొని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు టెండర్‌లలో పాల్గొనే సంస్థలు, వ్యక్తుల దరఖాస్తులను భారీగా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

4 స్లాబుల్లో లైసెన్స్ ఫీజులు

2019 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండేళ్ల లైసెన్స్ గడువు కోసం ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు ఫీజు సుమారుగా 600 కోట్ల రూపాయల వరకు వచ్చింది. ప్రస్తుతం ఈసారి దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 4 స్లాబుల్లో లైసెన్స్ ఫీజులున్నాయి. రూ. 45 లక్షలు, రూ. 50 లక్షలు, రూ.80 లక్షలు, కోటి 20 లక్షల రూపాయల స్లాబులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే లైసెన్స్‌ల ధరలను కూడా ప్రభుత్వం పెంచాలని, కొన్ని ఏరియాల్లో 5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్టుగా ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రం ఏర్పడ్డాక 80 కొత్త బార్లు

రాష్ట్రం ఏర్పడ్డాక 80 కొత్త బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. అయితే పలు కారణాల వల్ల లైసెన్స్ పొందిన షాపులు నిర్వహణలో లేవని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. వీటి స్థానంలో మరో 200 కొత్త మద్యం షాపులకు అనుమతినివ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మండలాలు, మున్సిపాలిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఈ మద్యం షాపులకు అనుమతివ్వాలని ఎక్సైజ్ శాఖ ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 మద్యం దుకాణాలుండగా వీటి ద్వారా రూ.1,360 కోట్ల లైసెన్సు రుసుం వసూలయ్యింది. ప్రస్తుతం ఈసారి లైసెన్సు రుసుముల పెంపు ద్వారా మరో రూ.500ల నుంచి రూ.800 కోట్లను అధికంగా రాబట్టుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News