Friday, April 26, 2024

పేట్రేగిన టెర్రరిస్టులు!

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లో కొత్త సంవత్సరం రక్తపాతంతో ప్రారంభమైంది. మొన్న ఆదివారం నూతన సంవత్సరాది నాడే సరిహద్దు జిల్లా రాజౌరి లోని డంగ్రీ గ్రామంలో టెర్రరిస్టుల కాల్పులకు నలుగురు మరణించారు. వారు పెట్టిన బాంబు మరుసటి రోజు సోమవారం ఉదయం పేలి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘాతుక ఘటనలను మతాలకు అతీతంగా స్థానిక ప్రజలందరూ ఖండించారు. టెర్రరిజాన్ని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని, సకాలంలో తగిన చర్యలు తీసుకోలేకపోయిన భద్రతా దళాల అసమర్థతను తీవ్రంగా నిరసించారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (రాజ్యాంగం 370వ అధికరణ) రాష్ట్ర హోదాను రద్దు చేసిన తర్వాత అక్కడ సాగుతున్నదంతా అమిత బాధాకరమైనదే. ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం లోపించడం, సాయుధ బలాల సాయంతోనే పాలన సాగుతూ వుండడం వల్ల ప్రజల హక్కులు బలి అవుతున్నాయి. టెర్రరిస్టుల విశృంఖల విహారానికి ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని బతకవలసి వస్తున్నది.

కశ్మీర్ లోయలో వలస కార్మికులను, పండిట్లను లక్షంగా చేసుకొని టెర్రరిస్టులు తరచూ దాడులు జరుపుతున్నారు. స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో దాదాపు 300 మందిని టెర్రరిస్టులు బలి తీసుకున్నట్టు సమాచారం. శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోడం వల్ల అసెంబ్లీ ఎన్నికలు జరపలేకపోతున్నారు. 2018 జూన్ నుంచి అవి బకాయి పడ్డాయి. టెర్రరిజాన్ని అరికట్టడం కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొన్నది. వాస్తవం అందుకు విరుద్ధంగా వున్నది. ఎన్నికలు జరిపితే బిజెపి ఎక్కువ స్థానాలు గెలుచుకొనేలా చూడడానికి నియోజక వర్గాల పునర్వవస్థీకరణ ప్రక్రియను చాకచక్యంగా జరిపించారు. అధిక జనాభా గల కశ్మీర్‌లో కేవలం ఒక్క స్థానాన్ని పెంచి బిజెపికి అనుకూల పరిస్థితి గల జమ్మూలో అదనంగా 7 స్థానాలను చేర్చారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికలు జరిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని 2020 ఆగస్టు 15 ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 2021 జూన్ 24న ఢిల్లీలో తన అధ్యక్షతన జరిగిన జమ్మూ కశ్మీర్ అఖిల పక్ష సమావేశంలో కూడా ఆయన ఇదే హామీ ఇచ్చారు.

గత జూన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తామని ప్రకటించారు. 2022 సంవత్సరాంతం లోగా ఎన్నికలు పూర్తి అవుతాయని రక్షణ మంత్రి రాజ్‌సింగ్ చెప్పారు. 2022 వెళ్ళిపోయింది, ఎన్నికలు మాత్రం జరగలేదు. అమిత్ షా చెప్పినట్టు చూసుకొన్నా ఈ జనవరి ఫిబ్రవరిలలో ఎన్నికలు జరగాల్సి వుంది. ఆ జాడలు బొత్తిగా లేవు. మే నెలలో జరుగుతాయనే ఆశను కేంద్రం ఇప్పుడు కలిగిస్తున్నది. ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహిస్తే అందులో ఎవరు గెలుస్తారనేది కీలకమైన ప్రశ్న. బిజెపి కోరుకొంటున్నట్టు ఎన్నికల ద్వారా అది అధికారంలోకి రాకపోతే దానికి తలవొంపులవుతుంది. బిజెపియేతర పార్టీలకు అధికారం లభిస్తే అవి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి, కేంద్రానికి ఘర్షణ తప్పనిసరి అవుతుంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు పెట్టుకొని ఈ ఏడాదిలో జమ్మూకశ్మీర్ ఎన్నికలు జరిపించే సాహసానికి మోడీ ప్రభుత్వం ఒడిగట్టకపోడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.

ఏమి చేయాలన్నా, చివరికి దేశమంతటితో పాటు జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిపించాలన్నా ముందుగా టెర్రరిజాన్ని సమూలంగా తొలగించాలి. మొన్న ఒకటి రెండు తేదీల్లో సంభవించిన హింసాకాండ అందుకు విరుద్ధమైన సంకేతాలను ఇస్తున్నది. జమ్మూకశ్మీర్‌ను మిగతా రాష్ట్రాలతో సమానంగా నిర్నిబంధంగా భారత దేశంలో అంతర్భాగం చేయదలిస్తే అది అక్కడి ప్రజల సమ్మతితో చేసి వుండాల్సింది. అందుకు పూర్వరంగాన్ని సృష్టించకుండా ఏకపక్షంగా ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అలాగే అక్కడి ప్రజలకు ప్రతేక హక్కులను కల్పించిన ఆర్టికల్ 35ఎ ని సాగనంపారు. ఇందుకు అక్కడి ప్రజలూ, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

నిరసన ప్రదర్శనలు జరగకుండా ప్రజలు యథేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కొంత కాలం ఇంటర్‌నెట్‌ను కూడా అక్కడ నిషేధించారు. కశ్మీర్‌కున్న ప్రత్యేక హక్కులను తొలగించాలనేది మొదటి నుంచి బిజెపి రాజకీయ విధానంగా వున్న మాట వాస్తవం. కాని ఏ ప్రాంతాన్ని పూర్తిగా వశపరచుకోవాలన్నా అక్కడి ప్రజలను కాదని దానిని సాధించుకోడం కష్టతరం. పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో గల, కొంత భాగం వివాదాస్పదంగా కొనసాగుతున్న కశ్మీర్ విషయంలో కేంద్రంలోని బిజెపి పాలకులు సున్నితంగా వ్యవహరించడానికి బదులు మొరటుగా అడుగులు వేసినందువల్లనే ఇప్పుడు అక్కడి పరిస్థితి పూర్తిగా వశంలోకి రావడం లేదు అనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News