Tuesday, May 7, 2024

సిరి మూటలు, పేదరికం మేటలు!

- Advertisement -
- Advertisement -

The corona has no effect on wealthy

 

కోవిడ్ -19 భారత్‌నే కాదు ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ చరిత్రలో ఇలాంటి విధ్వంసాన్ని చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. ఒక పక్క ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటే అదే సంపన్నులకు వరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యవాతపడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. దీంతో పలువురు కడు పేదరికంలోకి జారిపోయారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల సంపద మాత్రం ఒక ఏడాదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా పెరిగింది.

కరోనా మహమ్మారికి ప్రపంచాన్ని ఆవరించినప్పటి నుంచి చూస్తే వారి సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతే, అదే సమయంలో పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారు. కరోనా మహమ్మారితో ఒక్కో దేశంలో ఒక్క విధంగా ప్రభావం చూపించింది. కరోనాతో ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక అసమతుల్యంతో పాటు దేశంలోనూ కూడా అసమతుల్యం పెరిగిపోయిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జరనల్ ఆంటోనియా గుటెరస్ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పేదేమిటంటే అందరం కలిసి ఒకే సముద్రంలో ఈదుతున్నామన్నారు. వారిలో కొందరు విలాసవంతమైన యాచిట్స్ లేదా (పడవ)ల్లో అయితే మరికొందరు శిథిలావస్థకు చేరిన పడవలో వేలాడుకుంటూ ప్రాణాలు దక్కించుకొనే పనిలో పడ్డారని వర్ణించారు.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారితో సంపన్న దేశాలు కూడా విలవిలలాడిపోయాయి. అయితే అభివృద్ధి చెందని దేశాలతో పోల్చుకుంటే ఈ దేశాలు త్వరగా కోలుకొనే అవకాశాలు ఉన్నా యి. దీంతో సంపన్న దేశాలు, పేద దేశాల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతుంది. దీంతో ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుంది. గత నెలలో ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదికలో అసమానత అనే వైరస్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని వందలాది మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. బతకడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా సంపన్నులపై కరోనా ఎలాంటి ప్రభావం చూపలేదు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2020లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదల సంఖ్య 200 మిలియన్‌ల నుంచి 500 మిలియన్‌లకు చేరిందని తేల్చి చెప్పింది. దీంతో సంపన్నులు, పేదల మధ్య అగాథం మరింత పెరిగిపోయింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పట్టినా బిలియనీర్ల సంపద ప్రపంచ వ్యాప్తంగా కళ్లు చెదిరేలా పెరిగిపోయింది. మార్చి 18 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు వారి సంపద సుమారు 3.9 ట్రిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం) రూ. 280 లక్షల కోట్లు పెరిగిపోయిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ మంది బిలియనీర్ల సంపద ఇదే సమయంలో కలిపితే ఏకంగా 540 బిలియన్ డాలర్లు పెరిగిపోయింది. ఆ పది మంది కుబేరుల మొత్తం సంపద కలిపితే కళ్లు చెదిరేల 11.95 ట్రిలియన్ డాలర్లుగా తేలింది. (ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్లు డాలర్లు.. భారత కరెన్నీ ప్రకారం లెక్కిస్తే 73 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు.)

అమెరికాలో టాప్ 25 కార్పొరేట్లు 2019తో పోల్చుకుంటే 2020లోనే 11 శాతం అధిక లాభాలను ఆర్జించారు. అమెరికాకు చెందిన ఇద్దరు బిలియనీర్లు ఒకరు స్పేస్ టెక్నాలజీ వ్యాపారవేత్త ఇలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ తమ నికర సంపదను గత ఏడాదిలో వరుసగా 128.9 బిలియన్ డాలర్లు.. 78.2 బిలియన్ డాలర్లుగా పెంచుకున్నారు. సంపద పెంచుకున్న వారిలో ఇద్దరు అమెరికన్ కుబేరులే కాదు మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఆయన సంపద మార్చి నుంచి అక్టోబర్ 2020 వరకు రెట్టింపు అయ్యి 78.3 బిలియన్ డాలర్లకు చేరింది.

ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదికలో ముఖేష్ అంబానీ సంపద గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 1,95,000 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. ఆయన స్వల్పకాలంలో సంపాదించిన మొత్తంలో సరాసరి నాలుగు రోజుల లాభాలు పక్కనపెడితే ఉద్యోగుల ఏడాది వేతనాలు చెల్లించవచ్చునని ఆక్స్‌ఫామ్ నివేదికలో వివరించింది. ఒకప్పుడు ఈ భూగోళంలో అత్యంత సంపన్నుల్లో 21వ స్థానంలో ఉన్న అంబానీ ప్రస్తుతం 6వ స్థానానికి ఎగబాకారు. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. భారత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎప్పుడూ ఎదుర్కొలేదు.

కరోనా వైరస్ ఏ దేశాన్ని విడిచిపెట్టలేదు. ఎలాంటి తారతమ్యం చూపలేదు. అన్నీ దేశాలదీ ఒకటే కథ అని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. ఇదే మార్చి నుంచి ఆగస్టు 2020 వరకు మధ్యప్రాచ్య దేశాలతో పాటు ఉత్తర అమెరికాలో సంపన్నుల సంపద ఏకంగా 20 శాతం పెరిగింది. ఈ మొత్తం ఎంత అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మార్చి నుంచి ఆగస్టు 2020 వరకు ఈ ప్రాంతానికి ఐఎంఎఫ్ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం కేటాయించిన మొత్తం కంటే రెట్టింపుగా తేలింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే గతంలో ఎన్నడూలేని విధంగా విమానాల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీనికి కారణం కరోనా కారణంగా కమర్షియల్ ఫ్లైట్‌లు నిషేధించడమే. ఈ సంపన్నుల సంపద అంతా మానవులపైనే సంపాదించిందే. కేవలం తొమ్మిది నెలల్లోనే బిలియనీర్లు తమ సంపదను అమాంతంగా పెంచుకుంటే… ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు మాత్రం తిరిగి కోలుకోవడానికి దశాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతుందని యుఎన్ నివేదికలో పేర్కొంది.

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అసమతుల్యం పెరిగింది. కరోనా రాక ముందే కోట్లాది మంది ప్రజులు దారిద్య్రరేఖకు దిగువన మగ్గుతున్నారు. ప్రపంచాన్ని కరోనా ముంచేసే సమయానికి సుమారు మూడు వందల కోట్ల మందికి హెల్త్‌కేర్ సదుపాయం అందుబాటులో లేదు. అలాగే మూడొంతుల మంది కార్మికులకు సామాజిక భద్రత లేదు. కాబట్టి కరోనా లాంటి విపత్తు వస్తే వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ధనిక -పేదల మధ్య వ్యత్యాసం పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితిని తప్పించవచ్చునని యుఎన్ నివేదికలో పేర్కొంది. అది ఎలా అంటే .. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభినప్పటి నుంచి టాప్10 బిలియనీర్లు తమ సంపదను పంచితే ఈ భూగోళంలో కరోనా వైరస్ ద్వారా సంక్రమించిన పేదరికం నుంచి తప్పించవచ్చునని సూచించింది. అది కాకుండా కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందేలా వీరు ఆ డబ్బు చెల్లిస్తే పేదలను ఆదుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది కార్యరూపం దాల్చే పరిస్థితి కనపడ్డంలేదు. సంపన్నులు మరింత సంపద మూటగట్టుకోవడానికే చూస్తాడు తప్ప పరోపకారంపై మొగ్గు చూపే అవకాశం లేదు.

కోవిడ్ ముందు నాటి పరిస్థితి రావాలంటే కనీసం దశాబ్దకాలం పడుతుంది. ఇలాంటి పరిస్థితి వల్ల రాజకీయంగా, సామాజికంగా దాని దుష్ఫలితాలు సమాజం పడతాయి. సమతుల్యం అంటే చాలా మంది ప్రజలు అనారోగ్యం పాలు కావడం, కొంత మందికి మాత్రమే విద్య అందుబాటులో ఉండటం, కొంత మంది సంతోషంగా, గౌరవంగా బతకడం కూడా సామాజిక అసమతుల్యం కిందికి వస్తుంది. దీంతో చాలా మంది భయంతో పాటు నిరాశకు లోను కావాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోని 501 మిలియన్‌ల మంది రోజుకు 5.50 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారని వెల్లడించింది. 2030 నాటికి ఒకవేళ ప్రభుత్వాలు అసమతుల్యం రెండు శాతం పెరగడానికి దోహదపడితే కరోనా వైరస్ కంటే ముందు పరిస్థితి కంటే ఎక్కువ శాతం మంది పేదరికంలో మగ్గుతారని పేర్కొంది.

ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది దక్షిణాషియాలో ఉన్నారు. వీరంతా కరోనా దెబ్బకు కకావికలమైనట్లు తాజా నివేదికలో తేటతెల్లం చేస్తున్నాయి. గత 40 ఏళ్లలో ఇలాంటి సంక్షోభం చూడలేదని వెల్లడించింది దక్షిణాసియాలో జిడిపి భారీగా పడిపోయిందని తెల్చి చెప్పింది. భారత్‌లో కూడా జిడిపి మైనస్-11 శాతం నమోదు కావచ్చునని నివేదికలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దశాబ్దాల పాటు సాధించిన అభివృద్ధి కాస్తా రివర్స్ అయ్యింది. దీంతో మిలియన్‌ల కొద్ది ప్రజలు మరింత కడు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఒక విశ్లేషణ ప్రకారం 70 దేశాలు అదనంగా 490 మిలియన్‌ల మంది పేదరికంలో జారుకునే విషయం తెలిసిందే. ఇక భారత్ విషయానికి వస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనబాట పట్టింది. దేశంలో కూడా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో రాజకీయ ఆర్థిక సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. దీంతో పాటు జాతీయ సంక్షభం ఏర్పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News