Tuesday, May 21, 2024

‘కరోనా కొత్త రకం’ భారత్‌లో లేదు

- Advertisement -
- Advertisement -

The ‘new type of corona’ does not exist in India

 

అయినా అప్రమత్తత అవసరం
కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్‌ప్రభావం ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త రకం ప్రభావంపై విశ్లేషణ జరుగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని విజ్ఞప్తి చేసింది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. దేశంలో కరోనా తాజా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వివరించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్య విభాగం) వికె పాల్ మాట్లాడుతూ, ‘ యుకెలో బైటపడిన కరోనా కొత్తరకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే దీనివల్ల కొవిడ్ వైరస్ తీవ్రతపై, మరణాల రేటుపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. వ్యాక్సిన్ సమర్థతపైనా ప్రభావం ఉండబోదు. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికయితే ఈ కొత్త వైరస్ ప్రభావం మన దేశంలో లేదు. కానీ దీనిపై అప్రమత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త వైరస్ ప్రభావంపై విశ్లేషణ జరుగుతోంది. వైరస్ జీనోమ్ వ్యవస్థపై అధ్యయనం చేస్తాం’ అని చెప్పారు.

మరికొన్ని దేశాల్లోను ఉండవచ్చు: సౌమ్యా స్వామినాథన్

ఇదిలా ఉండగా బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌లాంటిది ఇప్పటికే మరికొన్ని దేశాల్లో ఉండి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లుహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. కొవిడ్ 19 జీనోమ్ పరిణామప్రక్రియకు సంబంధించి బోలెడంత అధ్యయనం చేస్తున్న దేశశాల్లో బ్రిటన్ ఒకటని, అందువల్ల అది ఈ కొత్త వైరస్‌ను ముందుగా గుర్తించగలిగిందని ఆమె అన్నారు. మిగతా దేశాలు కూడా తమ గణాంకాలను నిశితంగా గమనించినట్లయితే అక్కడ కూడా ఈ కొత్త వైరస్‌ను లేదా ఇలాంటి మరో రకం వైరస్‌ను అవి కనుగొనే అవకాశం లేకపోలేదని ఆమె చెప్పారు. బ్రిటన్‌తో పాటుగా ఇటలీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాల్లో ‘ బి117’గా పిలవబడే రూపాంతరం చెందిన వైరస్‌కు సంబంధించిన కేసులు వెలుగు చూడగా, దక్షిణాఫ్రికాలో మరో రకం మార్పు చెందిన వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే.

అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని,ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇది తొలివైరస్‌కన్నా 70 శాతం వేగంగా ఇతరులకు వ్యాపించవచ్చని మాత్రమే తెలుస్తోందని, ఒకటి రెండు మార్పులు ఇప్పుడున్న కొవిడ్ వ్యాక్సిన్‌ల వల్ల అభివృద్ధి చెందే వ్యాధినిరోధక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా ఫైజర్ వ్యాక్సిన్ కొత్త వైరస్‌నుంచి రక్షణ కల్పిస్తుందని యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ రెగ్యులేటర్ చీఫ్ కూడా చెప్పారు. తమ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కొత్త రకం వైరస్‌పై అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News