Tuesday, April 30, 2024

హైదరాబాద్ కొప్పులో ఒప్పో

- Advertisement -
- Advertisement -

చైనా బయట తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ

ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌లోని తమ ఆర్&డి సెంటర్‌లో స్థాపన
దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
ప్రభుత్వ టిఎస్ ఐపాస్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
దాని వల్లే రాష్ట్రానికి విశేషంగా భారీగా పెట్టుబడులు
హైదరాబాద్ లాబ్ ద్వారానే దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, ఐరోపా దేశాల ఇన్నోవేషన్ కార్యకలాపాలు, కెమెరా, బ్యాటరీలకు సంబంధించిన మరి 3 ప్రత్యేక ల్యాబ్‌లను కూడా హైదరాబాద్ ఏర్పాటు చేస్తాం
భారత్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : ఒప్పో సంస్థ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టగా.. తాజాగా హైదరాబాద్‌కు మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన 5జి ఇన్నోవేషన్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోనే ఇది మొదటి 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ కానుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో సానుకూలమని మరోసారి నిరూపితమైందని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఒప్పో కంపెనీకి ఉన్న ఆర్ అండ్ డి సెంటర్‌లో 5జి ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పాలన.. టిఎస్ ఐపాస్ విధానాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంలో వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖానించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా 5జి అభివృద్ధిని ఈ ల్యాబ్ ద్వారా వేగవంతం చేయనున్నట్లు ఒప్పో సంస్థ తెలిపింది. మిడిల్ ఈస్ట్ ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, ఐరోపా దేశాలకు సంబంధించిన ఇన్నోవేషన్ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కెమెరా, బ్యాటరీ, పర్ఫామెన్స్‌లకు సంబంధించి మరో మూడు ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

చైనా తరువాత హైదరాబాద్‌లోనే తమ తొలి 5జి ల్యాబ్ అని ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా నూతన సంస్కరణలతో పాటు, భారత దేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలన్న లక్షంలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా వారం రోజుల క్రితం ప్రముఖ ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా పెట్టుబడుల జాబితాలో చేరిన విషయం తెలిసిందే. ఇటలీకి చెందిన ఫియట్.. ఉత్తర అమెరికా తర్వాత భారీ డిజిటల్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. జీప్ కార్లకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమొబైల్ సంస్థ ఫియట్ క్రిస్లర్ తెలంగాణలో 15 కోట్ల డాలర్ల పెట్టుబడులు అంటే సుమారు రూ. 1100 కోట్లతో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేసేందుకు సముఖతను వ్యక్తం చేసింది. కాగా నూతన సంవత్సరంలో మరిన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ఐటి, ఇండస్ట్రీస్ అధికారులు ఒక కార్యచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లోని ప్రముఖ కంపెనీలతో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. వారు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో సానుకూలతను వ్యక్తం చేశారని సమాచారం. త్వరలోనే పెట్టుబడులకు సంబంధించిన మరిన్ని అంశాలు వెల్లడి కానుందని తెలుస్తోంది.

Oppo to Set Up 5G Innovation Lab in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News