Monday, May 6, 2024

వాక్యం వికాసాత్మకం కావాలి

- Advertisement -
- Advertisement -

సాహితీ విమర్శకులు గుంటూరు లక్ష్మీనర్సయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : వాక్యం రసాత్మకం మాత్రమే కాదని, వాక్యం మానసిక సామాజిక వికాసం కోసం వికాసాత్మకం కావాలని ప్రముఖ సాహితీ విమర్శకులు గుంటూరు లక్ష్మీనర్సయ్య అన్నారు. అసమానతలు, అవమానాల గురించి సమాజంలో అట్టడుగు పొరల్లో ఉన్న మూల్గుల్ని విని సమాజ వికాసానికి వికాసవంతమైన ఆలోచనలను రచయితలు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో రవ్వా శ్రీహరి వేదికపై కే.ఆనందాచారి అధ్యక్షతన ‘ నేటి సామాజిక పరిణామం – రచయితల స్పందన’ అన్న అంశంపై జరిగిన సెమినార్‌లో లక్ష్మీ నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సంస్కృతం, హిందీ భాష మాత్రమే ఉండాలని ఆ రెండిటిని దేశంపై రుద్దుతాను అనడం సరైంది కాదన్నారు. ఒక మతానికి వ్యతిరేకంగా వ్యతిరేకతను పెంచే విధానాలు సరియైనవి కావన్నారు. దేశంలో అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన దేశ పెద్దలు వారిని విభజించి పాలించాలని చూడడం దుర్మార్గమని ఆయన ధ్వజం ఎత్తారు. ప్రశ్నించిన వారిని సామాజిక ద్రోహులుగా చర్చించటం పౌర సమాజానికి తీరని నష్టమన్నారు. ఇలాంటి బాధాకర పరిస్థితిలో కవులు, రచయితలు తమ వంతు పాత్రను పోషించాలన్నారు. కవులారా, రచయితలారా మీరు ఎటువైపు అన్న ప్రశ్న ఈనాటి సమాజానికి మరింత అవసరమని ఆయన తెలిపారు. అసహయులకు, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగింది సాహిత్యం అని లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, జూపాక సుభద్ర, ఎన్ వేణుగోపాల్, తెలకపల్లి రవి పాల్గొని ప్రసంగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News