Sunday, April 28, 2024

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారధి

- Advertisement -
- Advertisement -

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
ఇటీవలే ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీ విరమణ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఎఎస్ సి.పార్థసారధి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన వి.నాగిరెడ్డి ఇటీవల పదవీ విరమణ చేశారు. అప్పట్నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. అయితే త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలతో పాటు మరో కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ప్రభుత్వం పార్థసారధిని నియమించింది. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్థసారధి ప్రస్థానం ఆర్‌డిఒ నుంచి మొదలైంది. 1988 సంవత్సరంలో ఆర్‌డిఒగా విధుల్లో చేరిన ఆయన తరువాత ఐఎఎస్‌గా పదోన్నతి పొంది జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.

సమాచార పౌరసంబంధాల కమిషనర్‌గా, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, వ్యవసాయ శాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆయన హయాంలోనే రైతుబంధు పథకం ప్రారంభమై విజయవంతంగా అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి రైతుబీమా పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పార్థసారధి అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం అప్పజెప్పిన పనిని ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారని పేరు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. ముఖ్యకార్యదర్శి హోదాలో ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా పార్థసారధి ఇటీవల పదవీవిరమణ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

TS Govt appointed Retired IAS Parthasarathy as EC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News