Friday, May 3, 2024

ఆంక్షల మధ్య మెట్రో పట్టాలపై పరుగులు

- Advertisement -
- Advertisement -

Runs on hyderabad metro rail restrictions

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో కరోనా నేపథ్యంలో ఐదునెలల పాటు నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇవ్వడంతో మొదటి కారిడార్ ఎల్బీనగర్, మియాపూర్ మధ్య పట్టాలపై రైళ్లు పరుగులు పెట్టాయి. మెట్రో ఉన్నతాధికారులు కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశారు. మెట్రో సిబ్బంది ఎప్పటికప్పడు స్టేషన్లు, రైళ్లు బోగీలను శానిటైజేషన్ చేస్తూ వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా స్మార్ట్‌కార్డు, క్యూఆర్ కోడ్ విధానంలో టికెట్లు అందజేస్తున్నారు. ప్రయాణించే వ్యక్తులకు థర్మల్ స్క్రీనింగ్, చేతులకు శానిటైజర్ చేసిన తరువాతే అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించకుంటే జరిమానాలు వేస్తామని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కులు ధరించేలా చేస్తున్నారు.

ఒక రైళ్లులో 900మంది వెళ్లే వెసులుబాటు ఉండగా నిబంధనలలతో మూడొంతుల మందికి మాత్రమే అవకాశం కల్పించారు. కూర్చోవడానికి, నిలబడానికి మార్కింగ్‌లు వేసి సూచించిన చోటనే ఉండాలని ప్రకటనలు చేస్తున్నారు. మొదటి రోజు రెడ్ కారిడార్‌పై 120 ట్రిప్పులు రైళ్లు నడిపి 19వేలు ప్రయాణికులను పలు ప్రాంతాలకు చేరవేశారు. కంటైన్‌మెంటు జోనుగా ఉన్న మూసాపేట, భరత్‌నగర్ స్టేషన్లు మూసివేసి ఎవరు అక్కడ రావొద్దని సూచిస్తున్నారు. మొదటి రోజు తాము ఆశించిన దానికంటే ఎక్కువ మంది ప్రయాణించి మెట్రో పట్ల ఆదరణ చూపినట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. మెట్రో ఎక్కువగా సాప్ట్‌వేర్ ఉద్యోగులు వెళ్లేవారని, వారంతా లాక్‌డౌన్ నుంచి ఇంటి వద్దనుంచే విధులు నిర్వహిస్తుండటంతో కొంత తగ్గిందని, వారు కార్యాలయాలకు వెళ్లితే రైళ్లు పెంచుతామని వెల్లడిస్తున్నారు.

మెట్రో రైళ్లులో వైరస్ రాకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. మంగళవారం రెండో కారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు సర్వీసులు ప్రారంభించారు. మూడో కారిడార్ ఎంజిబిఎస్ నుంచి జెబిఎస్ వరకు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో జనాదరణ పెరుగుతుందని దీంతో రైళ్ల వేళ్లల్లో మార్పులు చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటలు, సాయంత్రం 4గంటల నుంచి 9గంటల వరకు నడుపుతుండగా త్వరలో సమయం పెంచుతున్నట్లు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుని మెట్రోకు పూర్వవైభవం తీసుకొస్తామని మెట్రో ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ప్రజలు రైళ్లులో ప్రయాణిస్తే మహమ్మారి సోకుతుందనే భయం దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News