Wednesday, May 8, 2024

పారిశ్రామిక రంగానికి అధిక కేటాయింపులు

- Advertisement -
- Advertisement -

పారిశ్రామిక రంగానికి అధిక కేటాయింపులు
గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా రూ. 1,078.81 కోట్ల కేటాయింపులు

telangana Budget 2021 Live

మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక రంగానికి ఈ వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. గత సంవత్సరం కంటే అధిక మొత్తంలో నిధులు కేటాయించింది. బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లను కేటాయించింది. కాగా గత సంవత్సరం పారిశ్రామిక రంగానికి రూ.1,998.19 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.1078.81 కోట్లు అదనంగా కేటాయించినట్లు అయింది. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలకు ఆర్థిక ఊతం కల్పించేందుకు ప్రస్తుతం అమలవుతున్న ‘టిఎస్ ప్రైడ్’ పథకం కింద ఈసారి పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ రాయితీలు, సబ్సిడీని 35 శాతం నుంచి 45 శాతానికి పెంపు తదితరాలను ప్రతిపాదించింది. అలాగే వాణిజ్య పన్ను మినహాయింపును 100 శాతానికి పెంచింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్‌సి, ఎస్‌టి పరిశ్రమల స్థాపన కోసం 39,590 యూనిట్లను రూ. 1,919 కోట్ల సబ్సిడీతో మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మున్సిపల్ శాఖకు భారీగా నిధులు
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కోసం ప్రభుత్వం రూ.15,030 కోట్లు కేటాయించింది. గతేడాది ప్రకటించిన బడ్జెట్‌లో రూ.14,809 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది స్వల్పంగా రూ.221 కోట్లను పెంచుతూ రూ.15,030 కోట్లను కేటాయించింది. ముఖ్యందా పట్టణాల్లో ఆధునిక సౌకర్యాలతో వైకుంఠదామాల నిర్మాణం కోసం రూ.200 నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అలాగే హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ సమీపంలోని సుంకిశీల నుంచి నగరానికి నీటిని తరలించడానికి రూ. 1,450 కోట్లతో తలపెట్టిన కొత్త ప్రాజెక్టుకు తొలివిడతగా రూ.725 కోట్లను కేటాయింపులు చేసింది. అలాగే మెట్రోరైల్‌కు మరో వెయ్యికోట్లు, అవుటర్ రింగ్‌రోడ్డు పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీకు తాగునీటి కోసం రూ.250 కోట్లను కేటాయింపులు చేసింది. ఇక వరంగల్ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు రూ. 150 కోట్ల మేరకు నిధుల కేటాయింపులు జరిపింది.

ఆరు జిల్లాల్లో ఎయిర్‌పోర్టుల అభివృద్దికి రూ.100 కోట్లు
ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు ఒక్కటి మాత్రమే విమాన సర్వీసులకు కేంద్రంగా మారింది. రాష్ట్రంలో విమానయానం చేసే ప్రజలంతా హైదరాబాద్‌కు రాకుండా ఉండేందుకు వివిధ నగరాలలో విమానయాన స్ట్రిప్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాలో వీటిని అభివృద్ధి చేయాలని తలపెట్టిది. ప్రధానంగా వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్ పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది.

హైదరాబాద్‌కు తగ్గిన నిధుల కేటాయింపులు
ఈ సారి బడ్జెట్‌లో హైదరాబాద్‌కు నిధుల కేటాయింపు భారీగా తగ్గింది. తాజా బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్ నగరానికి అన్ని కలిపి కేవలం రూ.3,625 కోట్లను మాత్రమే కేటాయించింది. గతేడాది ప్రకటించిన బడ్జెట్‌లో వివిధ పనులతో కలిపి మొత్తం రూ.10 వేల కోట్లు నగరానికి కేటాయించిన ప్రభుత్వం, ఇప్పుడు దాదాపు మూడో వంతు నిధులకు కోత విధించింది. అయితే ఈ సారి బడ్జెట్‌లో ఉచిత నీటి పథకానికి రూ.1,450 కోట్లను, హైదరాబాద్ మెట్రో కోసం రూ.1000 కోట్లు కేటాయించారు. అలాగే మూసీనది పనుల కోసం రూ.200 కోట్లను కేటాయించింది.

పంచాయతీరాజ్‌కు రూ.29,271 కోట్లు
బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అధిక ప్రాధాన్యత లభించింది. ఈ శాఖకు రూ 29,271 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పల్లెప్రగతికి రూ. 5,761 కోట్లను వెచ్చించనుంది. అలాగే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు రూ.500 కోట్ల నిధులను ఇవ్వనుంది. ఇందులో జిల్లా పరిషత్తులకు రూ.252 కోట్లు, మండల పరిషత్తులకు రూ.248 కోట్లను ప్రతి సంవత్సరం అందించనుంది.

ఆసరా ఫించన్లకు రూ. 11,728 కోట్లు

ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రూ. 11,728 కోట్లను కేటాయించింది. ఇందులో వృద్ధులు, వితంతువులు, బిడి కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేతకార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, ఒంటరి మహిళలకు రూ. 2,016 ఫించన్ ఇస్తోంది. అలాగే దివ్యాంగులకు రూ.3016 రూపాయల చొప్పున ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తోంది.

అటవీ శాఖకు పెరిగిన నిధులు
రాష్ట్ర బడ్జెట్‌లో అటవీ శాఖకు మంచి ప్రాధాన్యత లభించింది. 2021..20-22 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.1,276 కోట్లను అటవీ శాఖకి కేటాయించింది. గతేడాది బడ్జెట్ లో రూ.1,091 కోట్లను కేటాయించగా, ప్రస్తుత కేటాయింపులతో అడవుల పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందనే చెప్పాలి. అంటే రూ.185 కోట్ల మేర అదనంగా కేటాయింపులు చేసింది. ప్రధానంగా రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం 33 శాతానికి పెంచేందుకుగానూ ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులను కేటాయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2015లో మొదలు పెట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో 10 లక్షల 50 వేల ఎకరాల అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకుంది.

TS Govt high priority to industrial sector in Budget 2021-22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News