Thursday, May 2, 2024

హుస్సేన్‌సాగర్, మూసీల సుందరీకరణకు సన్నాహాలు..

- Advertisement -
- Advertisement -

హుస్సేన్‌సాగర్, మూసీల సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
ఎన్జీటి ఆదేశాల మేరకు అనేక చర్యలు, పలు కంపెనీలకు నోటీసులు జారీ
హుస్సేన్‌సాగర్, మూసీల విస్తీర్ణం సర్వే.. ఆక్రమణల కూల్చివేతకు నిర్ణయం

TS Govt Plans for beautification of Hussain Sagar

మనతెలంగాణ/హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ సుందరీకరణతో పాటు దాని ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హుస్సేన్‌సాగర్ కాలుష్యమయంగా మారిందని నిపుణుల కమిటీ స్పష్టం చేస్తూ ఎన్జీటికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఎన్జీటి ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే సాగర్ విస్తీర్ణంతో పాటు దాని చుట్టూ పక్కల ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పర్యాటలను ఆకట్టుకునేలా అనేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇప్పటికే కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు నోటీసులు ఇవ్వడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగనీటిని సాగర్‌లోకి మళ్లీంచరాదని ఆయా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. మురుగునీటిని శుద్ది చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు మూసీనది చుట్టూ ఆక్రమణలను కూల్చివేయడంతో పాటు దాని సుందరీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది.
ఐదు నాలాల ద్వారా మురుగునీరు హుస్సేన్‌సాగర్‌లోకి
హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలంటూ సామాజికవేత్త లుబ్నా సార్వత్ దాఖలు చేసిన పిటిషన్‌తో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి) గతంలో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సాగర్‌ను పరిశీలించి నీటి నాణ్యత, కాలుష్యానికి గల కారణాలతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేసి నివేదికను ఎన్జీటికి అందచేసింది. ఐదు నాలాల ద్వారా మురుగునీరు హుస్సేన్‌సాగర్‌లోకి వస్తుందని, ప్రధానంగా కూకట్‌పల్లి నాలా వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని కమిటీ తేల్చింది. దాదాపు 50 శాతం శుద్ధిచేయని మురుగునీరు పారిశ్రామిక వ్యర్థజలాలు నేరుగా ఇందులో కలుస్తాయని ఎన్జీటికి ఇచ్చిన నివేదికలో ఈ కమిటీ పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌ను పరిరక్షించడానికి ఆయా శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఈ కమిటీ సూచించింది. కాలుష్యం, ఆక్రమణల నుంచి కాపాడడానికి నియంత్రణ అధికారాలు కల్పిస్తూ వివిధ భాగస్వామ్య శాఖలతో లేక్ పరిరరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. స్వతంత్ర సాంకేతిక బృందంతో రాష్ట్ర స్థాయి లేక్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. సాగర్‌లో కలిసే వ్యర్థాలతో 40 నుంచి 50 శాతం శుద్ధిచేయని నీళ్లేనని ఈ కమిటీ పేర్కొంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా రాష్ట్ర పిసిబి చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని పరిశ్రమలు నాలాలోకి అక్రమంగా వ్యర్థాలను విడుదల చేస్తున్నాయని, వాటిని నియత్రించడానికి మరిన్ని చర్యలు అవసరమని స్పష్టం చేసింది. రెండు నాలాలకు సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపి)లు ఏర్పాటు చేసినప్పటికీ శుద్ధి చేయని నీరు సాగరంలో కలుస్తోందని పేర్కొంది. మురుగునీరు శుద్ధి చేయని నీరు సాగర్‌లో కలుస్తోందని, మురుగునీరు శుద్ధి చేసేంత ఎస్టీపీలు లేవని తెలిపింది.

హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంతం తగ్గిందని..
పూర్తి స్థాయిలో ఎస్టీపిల సామర్థాన్ని పెంచాలని ఈ కమిటీ సూచించింది. మురుగునీరు సాగర్‌లో కలవకుండా నీటిని మళ్లీంచడానికి ఆయా నిర్మాణాలు చేపట్టినా అవన్నీ తాత్కాలికమేనని తెలిపింది. ఇప్పటికే చాలావరకు సాగర్ పరీవాహక ప్రాంతం తగ్గిందని దాంతో తాజా నీరు సాగర్‌లోకి ప్రవేశించడం చాలా తక్కువని వివరించింది. హుస్సేన్‌సాగర్ మిగులు జలాలను వైస్రాయ్ హోటల్, జిహెచ్‌ఎంసి కార్యాలయాల వద్ద ఉన్న రెండు తూముల ద్వారా మూసీనదిలోకి విడుదల చేస్తారని ఈ కమిటీ తెలిపింది. వైస్రాయ్ హోటల్ దగ్గర ఉన్న తూమును వరద సమయాల్లో మాత్రమే తెరుస్తారని, జిహెచ్‌ఎంసి కార్యాలయం దగ్గర ఉన్న తూము నుంచి సాధారణ రోజుల్లోనూ నీటిని విడుదల చేస్తారని ఈ కమిటీ వివరించింది. ఈ నీటిలో గోల్నాక వద్ద రోజుకు 80 మిలియన్ లీటర్ల శుద్ధి చేసే సామర్థం ఉన్న ఎస్టీపీలో శుద్ధి చేస్తున్నారని మిగతా నీరు అలాగే నేరుగా మూసీనదిలో కలుస్తోందని స్పష్టం చేసింది. మూసీలో ఇతర నాలాల ద్వారా శుద్ధి చేయని నీరు కలుస్తోందని పేర్కొంది. మూసీనది కాలుష్యం వలన పర్యావరణం కలుషితం అవుతుందని, ఈ నేపథ్యంలోనే నది మొత్తాన్ని అధ్యయనం చేయాలని ఈ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆక్రమణలు తొలగించాలని ఈ కమిటీ సూచించింది. దాదాపు 50 శాతం శుద్ధి చేయని వ్యర్థజలాలు మూసీలో కలుస్తున్నాయని, ఈ నేపథ్యంలో చిత్తడి నేలల చట్టం ప్రకారం లేక్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్జీటికి ఇచ్చిన నివేదికలో ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలను ఎన్జీటి జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనతో పాటు మూసీనది సుందరీకరణకు నడుం బిగించింది.

TS Govt Plans for beautification of Hussain Sagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News