Sunday, April 28, 2024

సాదాబైనామాలపై త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు!

- Advertisement -
- Advertisement -

సాదాబైనామాలపై త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు!
క్రమబద్ధీకరణ పారదర్శకంగా జరగాలి
పేదలకు మేలు జరిగేలా ఉండాలి
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్

TS Govt to Release guidelines on Sada Bainama soon

మనతెలంగాణ/హైదరాబాద్: సాదాబైనామాలపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. 60 ఏళ్లుగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలు (తెల్లకాగితాలపై భూముల క్రయ, విక్రయాల)కు మోక్షం కలించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులతో సమావేశం జరిపిన ఆయన కోర్టు ఇచ్చే సూచనలకు ఆధారంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తాజాగా కలెక్టర్‌లతో జరిగిన సమావేశంలో సాదాబైనామాలకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను సైతం ఆదేశించినట్టుగా సమాచారం. 2016లో ప్రభుత్వం ప్రకటించిన సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో నిబంధనల మేరకు 6.18 లక్షల దరఖాస్తుల్లో 2 లక్షల ఎకరాలకు పైగా భూములను క్రమబద్ధీకరించారు. నిబంధనల ప్రకారం లేని 4.19 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. తాజాగా 2020 అక్టోబర్ 12వ తేదీన చివరివిడతగా క్రమబద్దీకరణ పథకాన్ని మళ్లీ ప్రభుత్వం ప్రకటించింది. అదే నెల చివరి గడువుగా పేర్కొన్నప్పటికీ ఆ తరువాత నవంబర్ 10వ తేదీ వరకు పొడిగింపునిచ్చింది. సాదా బైనామాలకు ఆర్‌ఓఆర్ చట్టం 197 ప్రకారం రూల్ 1989లోని రూల్ 22 ప్రకారం ఫారం 10లో దరఖాస్తు చేసుకున్న వారికి 13 బి ధ్రువీకరణ పత్రంతో చట్టబద్ధత కల్పించాలని ఆ చట్టంలో ఉంది.
అక్టోబర్ 29 నాటికి దాదాపు 2.26 లక్షల దరఖాస్తులు
కొత్త చట్టంలో సాదాబైనామాలకు అవకాశం లేకపోవడంతో నూతనంగా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ 29 నాటికి దాదాపు 2.26 లక్షల దరఖాస్తులు క్రమబద్ధీకరణ కోసం వచ్చాయని అధికారుల గణాంకాలు చెబుతుండగా, మరోసారి గడువు పెంపుతో మరో 6.74 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో పాత చట్టం ప్రకారం అక్టోబర్ 29 నాటికి వచ్చిన వాటినే గుర్తించి క్రమబద్ధీకరణ పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. దీనిని కూడా మూడునెలల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2016 సంవత్సరంలో సాదాబైనామాల దరఖాస్తుల విషయంలో కొందరు అధికారులు లంచాలు తీసుకొని వేరే వారికి మేలు చేశారని సిఎం కెసిఆర్ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసారి అలా కాకుండా జాగ్రత్తగా దరఖాస్తులను పరిశీలించడంతో పాటు అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించినట్టుగా సమాచారం. 2016లో సాదాబైనామాల మీద ఉన్న 5 ఎకరాలలోపు భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి, పేరు మార్పిడి చేయాలని, ఎనిమిది రోజుల్లోపు వివరాలను కంప్యూటర్‌లో అప్‌డేట్ చేయాలని సిఎం కెసిఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
డబ్బులు తీసుకోకుండా పారదర్శకంగా మ్యుటేషన్ ప్రక్రియ
దీంతోపాటు వారసత్వ హక్కుల ప్రకారం యాజమాన్య హక్కుల పేరు మార్పిడి (ఫౌతీ) అమలు చేసే విషయంలో 10 రోజుల గరిష్ట వ్యవధి పెట్టుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు వచ్చిన 10 రోజుల్లోగా యాజమాన్య హక్కుల ఖాతాలో పేరు మార్పిడి చేసి 11వ రోజు కలెక్టర్‌కు వివరాలు పంపాలని నిర్ధేశించారు. అనంతరం దరఖాస్తుల విషయంలో అభ్యంతరాలను తెలపాలని, విషయ పరిజ్ఞానం లేనివాళ్లకు, నిరక్షరాసులకు అవగాహన కల్పించాలని, డబ్బులు తీసుకోకుండా పారదర్శకంగా మ్యుటేషన్ ప్రక్రియ ముగించాలని సిఎం కెసిఆర్ ఆదేశించినా ఆ దిశగా అధికారుల చర్యలు చేపట్టలేదు. దీంతోపాటు సాదాబైనామాల క్రయ, విక్రయాల ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించేలా ఫారం 13 (బి)ను జారీ చేసి ఈ పథకాన్ని ముగించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈసారి పకడ్భందీగా సాదాబైనామాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా జరగాలని, మార్గదర్శకాలు పేదలకు మేలు జరిగేలా ఉండాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది.

TS Govt to Release guidelines on Sada Bainama soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News