Wednesday, May 1, 2024

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు..

- Advertisement -
- Advertisement -

సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన

High Court Hearing on Assets Enrolling in Dharani 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు సోమవారం నుంచి పాత పద్ధతిలో కార్డు (సిఎఆర్‌డి) విధానంలో జరగనున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శనివారం వరకు స్లాట్ చేసుకున్న వారికి యధావిధిగా రిజిస్ట్రేషన్‌లు చేయడంతో పాటు సోమవారం నుంచి పాత పద్ధతిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారికి రిజిస్ట్రేషన్‌లు చేయాలని సిఎం కెసిఆర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత పద్ధతిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ జరగాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సిఎం ఆదేశాల నేపథ్యంలో సోమవారం నుంచి స్లాట్ విధానం లేకుండా పాత పద్ధతిలో కార్డు విధానం ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో ఇప్పటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్‌లను నిలిపివేసినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది.
ఐజి శేషాద్రి సర్యులర్ మెమో జి3/541/2020 జారీ
శనివారం వరకు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా రిజిస్ట్రేషన్‌లు చేస్తామని, ఈనెల 21వ తేదీ నుంచి (సోమవారం) నుంచి యధావిధిగా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజి శేషాద్రి సర్యులర్ మెమో జి3/541/2020, తేదీ 18.12.2020న అన్ని సబ్ రిజిస్ట్రార్‌లకు జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేయాలని, స్లాట్ బుక్ పద్ధతిని హైకోర్టు ఆదేశాల మేరకు ఆపివేశామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆ సర్కులర్‌లో ఐజి సబ్ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 8వ తేదీన వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం ఆపివేసిన విషయం తెలిసిందే. సుమారు 90 రోజుల తరువాత డిసెంబర్ 11వ తేదీన స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్‌లను చేయడం ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థలో ప్రజల్లో జవాబుదారీతనం పెరగడంతో పాటు పారదర్శకత కల్పించవచ్చన్న ఉద్ధేశ్యంతో సిఎం కెసిఆర్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
శనివారం వరకు 2,599 స్లాట్ బుకింగ్‌లు
అందులో భాగంగా ప్రజలు ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్‌లు చేసుకునేలా నూతన వ్యవస్థను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం ప్రారంభించిన ఈ విధానం ద్వారా 19వ తేదీ (శనివారం) వరకు 2,599 రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ బుకింగ్‌లు కాగా, 1,760 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. దీంతోపాటు ప్రజల కోసం 23 రకాల లావాదేవీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. త్వరలో మరో 5 సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానానికి బిల్డర్లు, బ్యాంకర్లు సైతం అభినందించారు. అయితే బిల్డర్లు, బ్యాంకర్లు లేవనెత్తిన పలు సమస్యలను పరిష్కరిస్తూనే మరిన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వారిద్దరి సూచనలు, మార్పులకు అనుకూలంగా ఈ కొత్త విధానంలో అనేక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బ్యాంకర్లలో సిఎస్ సోమేష్‌కుమార్ సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. వీరితో పాటు బిల్డర్లకు ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను అప్పటికప్పుడు సిఎస్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిష్కరించారు.
ప్రస్తుతం మరిన్ని వివరాల కోసం కాల్‌సెంటర్‌ను…
ప్రస్తుతం కొత్త రిజిస్ట్రేషన్‌ల విధానం సజావుగా సాగుతుండగానే హైకోర్టు స్లాట్ బుకింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ (పిటిఐఎన్) విధానంతో పాటు ఆధార్ వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని(డబ్లూపి, పిల్‌నెంబర్ 248,254, 264 ఆఫ్ 2020)లతో పాటు(డబ్లూపి నెంబర్లు 17930, 18397, 18408, 18453, 18854 ఆఫ్ 2020) ఉత్తర్వులను హైకోర్టు జారీ చేయడంతో పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మరిన్ని వివరాల కోసం 24*7 కాల్ సెంటర్ (18005994788), ఈమెయిల్: grievance—– igrs@igrs.telangana.gov.in, వాట్సాప్ నెంబర్ 9121220272లలో సంప్రదించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లపాటు పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

TS Govt to stopped Slot booking system

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News