Tuesday, April 30, 2024

పెరిగిన ఆర్టీసి బస్‌పాస్ చార్జీలు..

- Advertisement -
- Advertisement -

TSRTC hikes Bus fare again

పెరిగిన ఆర్టీసి బస్‌పాస్ చార్జీలు..
నేటి నుంచి అదనపు డీజిల్ సెస్ సైతం అమల్లోకి..
ఆర్టీసి ప్రయాణికులపై అదనపు భారం
కి.మీలు పెరిగే కొద్దీ పెరగనున్న సెస్ చార్జీలు
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు మినహాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: అదనపు డీజిల్ సెస్ విధించకుండా సంస్థ ఆ ఆర్థిక భారాన్ని భరించే పరిస్థితిలో లేదని, అదనపు డీజిల్ సెస్ విధించడం, విద్యార్థుల కోసం బస్‌పాస్ ఛార్జీలను పెంచడం వంటి ప్రతిపాదనలను ప్రయాణికులు అర్ధం చేసుకోవాలని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్‌లు పేర్కొన్నారు. కొన్ని సంస్థ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రయాణికులు ఆదరించాలని వారు సూచించారు. తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణిలపై భారం పడకుండా తాము చర్యలు తీసుకున్నామని, గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణించే ప్రయాణికులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చామని వారు పేర్కొన్నారు.
30 లక్షల మంది ప్రయాణికులు… 12 లక్షల విద్యార్థులు….
రాష్ట్రంలోని వివిధ గమ్యస్థానాలకు ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులను, 12 లక్షల విద్యార్థులను తీసుకువెళుతున్న ఏకైక ప్రజా రవాణా సంస్థ టిఎస్ ఆర్టీసి అని, ఈ సంస్థ మనుగడ సాధించాలంటే కొన్ని చార్జీలను తాము పెంచాల్సి వస్తుందని వారు తెలిపారు. ఆర్టీసి రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్‌ను నియోగిస్తోందని, బల్క్ హెచ్‌ఎస్‌డి ఆయిల్ ధర 2021 డిసెంబర్‌లో లీటరు రూ.84.75లు ఉండగా, 2022 మార్చి నాటికి రూ.118.73 పెరిగిందని వారు తెలిపారు. దీనివల్ల ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసి భారీగా పెరిగిన డీజిల్ ధర ఆర్థిక భారంగా మారిందన్నారు. దీనివల్ల ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు రూ.5 కోట్ల నష్టం వస్తుందని దీనిని పూడ్చుకోవడానికి తాము కొన్ని చార్జీలను పెంచాల్సి వస్తుందని వారు తెలిపారు.
ఎక్కువ స్లాబ్‌లు అమల్లోకి….
ఈ ఏడాది ఏప్రిల్ 09 నుంచి అమల్లోకి వచ్చే విధంగా, సంస్థ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌ల్లో ప్రతి ప్రయాణికుడికి రూ.2లు నామమాత్రపు డీజిల్ సెస్ విధించామని వారు పేర్కొన్నారు. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా ఇతర అన్ని సర్వీసుల్లో ప్రతి ప్రయాణికుడికి రూ.5లను విధించామని, సిటీ, గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులతో పోల్చినప్పుడు సుదూర, మధ్యస్థ దూరం ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణిస్తారని వారు తెలిపారు. తద్వారా ప్రయాణించిన దూరాన్ని బట్టి డీజిల్ ధర పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అందులో భాగంగా ఆర్టీసి బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఎక్కువ, తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు తక్కువగా ఈ సెస్ విధించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి, జిల్లాల్లోని అన్ని రకాల సర్వీసులు, సుదూర సర్వీసుల్లో డీజిల్ సెస్‌ను రూ.5లు అంతకంటే ఎక్కువ స్లాబ్‌లను సంస్థ అమలు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. పల్లెవెలుగు సర్వీసుల విషయానికొస్తే, తక్కువ దూర ప్రయాణికులపై భారం పడకుండా ఉండేందుకు కనీస ఛార్జీ రూ.10ల్లో ఎటువంటి మార్పు ఉండదని వారు తెలిపారు.
అదనపు డీజిల్ సెస్ ధరలు ఈ విధంగా….
రకం                              అదనపు డీజిల్ సెస్
పల్లెవెలుగు                రూ.5 నుంచి రూ.45లు      250 కి.మీల వరకు
ఎక్స్ ప్రెస్                  రూ.5 నుంచి రూ.90లు      500 కి.మీ వరకు
డీలక్స్                     రూ.5 నుంచి రూ.125లు    500 కి.మీ వరకు
సూపర్‌లగ్జరీ               రూ.10 నుంచి రూ.130లు   500 కి.మీ వరకు
ఏసి సర్వీసులు           రూ.10ల నుంచి రూ.170లు  500 కి.మీ వరకు దూరానికి..

(గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంచకపోవడంతో బస్సుల్లో ప్రయాణించే ఈ ప్రయాణికులకు ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్టీసి అధికారులు తెలిపారు.
ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు…
పెరిగిన డీజిల్ ధరను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్టు చైర్మన్, ఎండిలు తెలిపారు. దాదాపు మూడేళ్లుగా బస్‌పాస్ ఛార్జీలు పెంచలేదని వారు పేర్కొన్నారు. సవరించిన ఛార్జీలు, బస్‌పాస్ ఛార్జీలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని వారు తెలిపారు. ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు సవరించిన ఛార్జీలు విధించబడవని వారు పేర్కొన్నారు. అంతకుముందు పాత ధరలతో జారీ చేసిన్ బస్‌పాస్‌లు వాటి గడువు ముగిసే వరకు పాత ధరల్లోనే చెల్లుబాటు అవుతాయన్నారు.

TSRTC hikes Bus fare again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News