Friday, April 26, 2024

కాటేసిన మద్యం..

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో మద్యం సేవించి ఇద్దరు మృతి చెందగా మరొకరు మద్యం మత్తులో కెఎల్‌ఐ కాలువలో పడి మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మోతి వైన్స్ అనే మద్యం దుకాణం ముందు నల్లవెల్లి గ్రామానికి చెందిన ముత్తిరాజ్ నరసింహ(52) అనే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. సోమవారం రాత్రి అదే మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగి పడుకున్న నరసింహ ఉదయం చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తలరించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామానికి చెందిన పాలడుగుల ఊశన్న(51) అనే వ్యక్తి మద్యం సేవించి నాగర్‌కర్నూల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా కూర్చున్న దగ్గరే చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.

అతని జేబులో మద్యం బాటిల్‌ను గుర్తించగా అది మోతి వైన్స్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇతని మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా తాడూరు మండలం చెర్లిటిక్యాల గ్రామానికి చెందిన బాబు గౌడ్(48) అనే వ్యక్తి నాగర్‌కర్నూల్ నుంచి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తూ కుమ్మెర వద్ద గల కెఎల్‌ఐ కాలువలో సోమవారం రాత్రి పడి మృతి చెందాడు. ఇతని మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనల్లో పోలీసులు మృతుల కుటుంబాల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కల్తీ మద్యం సేవించి మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఒకే రోజు జిల్లాలో మూడు సంఘటనలు చోటు చేసుకోవడం, అది కూడా నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడంతో ఈ సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే తప్ప వీరి మృతికి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News