Sunday, April 28, 2024

నిర్లక్ష్యం ఖరీదు… ఇద్దరు చిన్నారుల బలి

- Advertisement -
- Advertisement -

Two Kids died in Road Accidents in Hyderabad

చంద్రాయణగుట్ట: నగరంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువు అభం శుభం తెలియని ఒక చిన్నారిని బలిగొంది. అప్పటి వరకు కేరింతలు కొడుతూ బుడిబుడి నడకలతో సందడి చేసిన చిన్నారి మృత్యువడికి చేరింది. బండ్లగూడ జహంగీరాబాద్, మిల్లత్‌నగర్ నివాసి మహ్మద్ నూర్ జరీ పని చేస్తుంటాడు. అతని కూతురు మరియం ఫాతిమా(3) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో రాతి పౌడర్ లోడ్‌తో మితి మీరిన వేగంతో వచ్చిన టిప్పిర్ (ఏపీ 03యు 2045) ఆ బాలికను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మరియం ఫాతిమా పొట్టపై నుంచి టిప్పర్ చక్రాలు వెళ్ళటంతో శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే స్థానికులు ఆ బాలికను కంచన్‌బాగ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రి వర్గాల సూచన మేరకు బాలికను అక్కడి నుండి ఉస్మానియాకు తీసుకువెళ్ళారు. బాలికకు పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు ఆమె మృతిచెందినట్లు తెలిపారు. అలగే మంగళ్‌హాట్ పరిధిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొనడంతో ఆరేళ్ల బాలుడు (హర్షవర్దన్) తీవ్రంగా గాయపడి, మార్గమద్యలో మృతిచెందాడు.
మార్చురీ వద్ద ఆందోళన
మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో మార్చురీ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాలుడి తల్లి రేణుక బోరన విలపిస్తూ తన కుమారుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దని, అలాగే తమకు అప్పగించాలని పట్టుబట్టింది. బాలుడి మృతికి కారణమైన వాహనం డ్రైవర్‌కి కఠిణ శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న టిపిసిసి కార్యదర్శి ఎం విక్రమ్‌గౌడ్ బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఫిరొజ్‌ఖాన్ మాట్లాడుతూ బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు చట్టపరమైన పోరాటం చేస్తానన్నారు. ఎమ్మార్పీఎస్ గోషామహల్ ఇంచార్జి పూజలోల్ల రవిమాదిగ మాట్లాడుతూ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే రాజాసింగ్
పెట్రొలింగ్ వాహనం ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందినట్లు తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో బాలుడి కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. మార్చురీలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని అప్పగించారు.

Two Kids died in Road Accidents in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News