Saturday, April 27, 2024

ఉక్రెయిన్ ప్రతిదాడి.. ఒక్కరోజే వెయ్యిమంది రష్యా సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

Ukraine retaliated against Russian troops

కీవ్ : తమ భూభాగాలపై మళ్లీ బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్షంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో రష్యా భారీ మొత్తంలో సైన్యాన్ని నష్టపోయిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కీవ్ దాడుల్లో ఒక్క రోజే కనీసం వెయ్యి మంది మాస్కో సేనలు మృతి చెందినట్టు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి కోసం రష్యా ఇటీవల వేలాది మంది సైనికులను ముందు వరుసలో కొత్తగా మోహరించింది. వీరిలో చాలామంది రిజర్విస్టులే. అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ రక్షణ నిఘా వర్గాల నిపుణులు వెల్లడించారు. ఈ క్రమం లోనే ఉక్రెయిన్ సేనలు వారిపై దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఒక్క రోజులోనే కనీసం వెయ్యిమంది క్రెమ్లిన్ సైనికులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక సైనిక చర్యలో ఇప్పటివరకు రష్యా 71 వేల మందికి పైగా సైనికులను నష్టపోయినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే తాజా మరణాలపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కోసం ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగం గానే అనేక మంది రిజర్విస్టులను వెనక్కి పిలిపించి ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపించారు. రష్యా అధికారుల వివరాలు ప్రకారం ప్రస్తుతం 41 వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నట్టు తెలుస్తోంది.కెర్చ్ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ పేల్చివేతకు ప్రతీకారంగా ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దళాలు పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో కీవ్ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్ , నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News