Friday, May 10, 2024

ఎడబాటే

- Advertisement -
- Advertisement -

Ukraine-Russia talks end incomplete

అసంపూర్తిగా ముగిసిన ఉక్రెయిన్-రష్యా చర్చలు
 తక్షణ కాల్పుల విరమణ, క్రిమియా, డాన్‌బాస్‌ల నుంచి వైదొలగాలని ఉక్రెయిన్ పట్టు నాటోలో చేరరాదని తదితర డిమాండ్లపై లిఖితపూర్వక హామీ కోరిన రష్యా
ఉక్రెయిన్ నగరం ఖార్కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా ఐదోరోజు దాడుల్లో స్వల్ప సంయమనం పాటింపు
ఉక్రెయిన్‌కు బాసటగా ఇయు, నాటో

గోమెల్/కీవ్/మాస్కో : ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య జరిగిన కీలక శాంతి చర్చలు సమస్య పరిష్కారం కాకుండానే ముగిసినట్టు సమాచారం. బెలారస్ సరిహద్దులోని గోమెల్ వేదికగా సోమవారంనాడు ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా రష్యా తమదేశంలో తక్షణమే కాల్పులను విరమించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా, డాన్‌బాస్ నుంచి రష్యా సేనలు భేషరతుగా వైదొలగాలని ఉక్రెయిన్ పట్టుబట్టింది. మరోవైపు రష్యా ప్రతినిధులు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని, అదే సమయంలో తమ డిమాండ్లపై లిఖితపూర్వక హామీ తప్పనిసరి అని రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం.

ఇరుపక్షాలు పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. తాజా చర్చల సారాంశాన్ని ఇరు దేశాలు అధినేతలకు రెండు దేశాల ప్రతినిధులు నివేదించిన తర్వాత రెండో దశ చర్చలు తిరిగి జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఎలాంటి తీర్మానాలు లేకుండానే గోమెల్‌లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కూడిన ఆరుగురు సభ్యులు బృందంతో రష్యాకు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఒకవైపు శాంతి చర్చలంటూనే ఉక్రెయిన్‌లో రెండో అతి పెద్ద నగరమైన ఖార్కీవ్‌లో రష్యా మారణహోమం సృష్టించింది. ఐదో రోజైన సోమవారంనాడు ఉదయాన్నే వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో డజన్ల కొద్దీ మంది దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు అంటోన్ హెరషెంకో వెల్లడించారు.

బెలారస్‌లో చర్చలకు ప్రతిపాదన చేసిన రష్యా మరోవైపు తమ దేశంలో దాడులకు తెగబడుతోందని ఆయన మండిపడ్డారు. అయితే ఒక్క ఖార్కీవ్ తప్ప మిగతా పట్టణాల్లో రష్యా దాడుల ఉధృతిని తగ్గించింది. రాజధాని కీవ్ సహా పలు పట్టణాల్లో స్వల్పంగా దాడుల ఘటనలు జరిగినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం వాటిల్లలేదు. మరోవైపు నగరాల్లోకి ప్రవేశిస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులను పౌరులు అడ్డగిస్తున్నారు. వాటిని పట్టణాల్లోకి ప్రవేశించకుండా చేసేలా ప్రెటోల్ బాంబు దాడులకు కూడా వెనకడుగు వేయబోమని హెచ్చరిస్తున్నారు. ఐదు రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో 3వేల మంది రష్యా సైనికులు తమ చేతిలో హతమయ్యాయరని, 200మందిని యుద్ధ ఖైదీలుగా చేసుకున్నామని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యాతో శక్తివంచన లేకుండా తలపడుతున్న ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఉన్న ఖైదీలను రష్యాపై పోరాడేందుకు విడుదల చేస్తోంది. సైనిక నేపథ్యం ఉండి, శిక్ష అనుభవిస్తున్న పలువురిని విడుదల చేస్తోంది.

వీరు రష్యా బలగాలతో తలపడనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల చేస్తున్న వేళ తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఇయు)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యా బలగాలను ఉద్దేశించి మీ ప్రాణాలు కాపాడుకోండి, ఉక్రెయిన్‌కు వదిలివెళ్లిపోండి అంటూ విజ్ఞప్తి చేశారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చలు సానుకూల ఫలితం ఇస్తుందని తాను అనుకోవట్లేదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అందుకు ఆశాజనకంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జెలెన్ స్కీ వ్యాఖ్యలపై యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ ఇయు కూటమిలో ఉక్రెయిన్ చేరడంపై కూటమిలోని 27 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.

102మంది సామాన్యులు మృతి చెందారు : ఐరాస

రష్యా దాడుల్లో మొత్తం 102 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే 5లక్షల మంది ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగుదేశాలకు వెళ్లిపోయారని పేర్కొంది. రష్యా గనుక యుద్ధం ఆపకపోతే ఇంకా 70లక్షల మంది వలసపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో లక్షలాది మంది ఉక్రెయిన్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఐరాస హెచ్చరించింది. వెంటనే ఉక్రెయిన్లో హింసను ఆపాలని ఇరు పక్షాలకు ఐరాస సర్వసభ్య సమావేశం సూచించింది. కాల్పుల విరమణ పాటించి తక్షణం సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

ఇయు, నాటో బాసట..

ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. నాటో చీఫ్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలవనున్నట్టు ప్రకటించారు. ఇదిలావుండగా రష్యాను ఆంక్షలతో ఇరకాటంలో పెడుతున్న పాశ్చాత్య దేశాలకు దక్షిణ కొరియా తోడైంది. రష్యా ఎగుమతులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది. వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులను నిషేధించడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయాలని దక్షిణ కొరియా భావించింది. ఇప్పటికే ‘స్విఫ్ట్’ అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులపైనా నిషేధం విధించింది. ఈ మేరకు రాజధాని సియోల్ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్‌లో మాట్లాడినట్లు నాటో చీఫ్ వెల్లడించారు. ఉక్రెయిన్‌కు క్షిపణులు, ఆయుధాలు సరఫరా చేస్తామని ఆయనకు హామీనిచ్చినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా కూడాపుతిన్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఆయన సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్యులపై ఆస్ట్రేలియా మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వీరందరిపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ప్రకటించారు.

వాళ్లది అబద్దాల సామ్రాజ్యం : పుతిన్

మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తో ంది. ఇప్పటికే అణా ్వయుధ ప్రయోగానికి హెచ్చరిక చేసిన పుతిన్ తాజాగా క్షిపణి బలగాలను సంసిద్ధం కావాలని ఆదేశించారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న ఐరోపా యూనియన్ దేశాలైన బ్రిటన్, జర్మనీ తదితర 36 దేశాల విమానాలపై నిషేధం విధించారు. తమ గగనతలం మీదుగా వెళ్లరాదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు బాసటగా నిలవడంతోపాటు తమపై ఆంక్షలు విధిస్తున్న పశ్చిమ దేశాలను ‘అబద్దాల సామ్రాజ్యం’గా పుతిన్ అభివర్ణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News