Friday, April 26, 2024

వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే ఎందుకు ధరిస్తున్నట్లు? చలివేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. దానికున్న కారణం నేను వివరిస్తాను…కేరళలో యాత్ర మొదలైనప్పుడు అక్కడ వేడిగా ఉండింది. కానీ ఎప్పుడైతే యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేశించిందో అప్పుడు కాస్త చలివేసింది. ఒక రోజున ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తులతో నా దగ్గరికి వచ్చారు. నేను వారిని చేత్తో పట్టుకున్నప్పుడు వారు వణుకుతున్నారు. నేనప్పుడే నిర్ణయించుకున్నాను. నాకు చలితో వణుకు పుట్టే వరకు టిషర్టును మాత్రమే వేసుకుని ఉండాలని’ అని రాహుల్ వివరించారు.

హర్యానాలోని అంబాలాలో ఓ వీధి చివర ఆయన ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అంత చలిలోనూ రాహుల్ గాంధీ కేవలం టిషర్టు మాత్రమే ధరించి ఉండటం అంతా మాట్లాడుకుంటుంటే ఆయన దాని వెనుక ఉన్న కారణాన్ని పై విధంగా వివరించారు. తాను ఆ పేద బాలికలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నానని తెలిపారు.

‘ఎప్పుడైతే నేను వణుకుతానో, అప్పుడే స్వెటర్ వేసుకునే విషయం ఆలోచిస్తాను. నేను ఆ ముగ్గురు బాలికలకు ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చలిని అనుభవిస్తుంటే, రాహుల్ గాంధీ కూడా చలిని అనుభవిస్తాడు’ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో యాత్ర చివరి దశలో ఉన్నప్పుడు ఆయన మీడియానుద్దేశించి ‘పేద బాలికలు స్వెటర్లు లేదా జాకెట్ లేకుండా చలికాలంలో నడుస్తున్నప్పుడు మీరెందుకు నన్ను అడిగినట్లు వారిని అడగలేదు? మీరెందుకు స్వెటర్లు ధరించలేదు? మీకు చలి వేయడం లేదా?’ అని ఎందుకు అడగలేదు అని ప్రశ్నించారు.

‘నా యాత్రలో చాలా మంది పేద రైతులు, కార్మికుల పిల్లలు చిరిగిన దుస్తులతో నడిచారు. కానీ మీడియా మాత్రం ఆ పేద పిల్లలు స్వెటర్లు, జాకెట్లు లేకుండా ఎందుకు ఈ చలికాలం నడుస్తున్నారని అడగలేదు’ అంటూ కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

‘నేనెందుకు కేవలం టిషర్టులతోనే పాదయాత్ర చేస్తున్నానన్నది ప్రశ్న కాదు. పేద రైతులు, కార్మికుల పిల్లలు ఎందుకు చిరిగిన దుస్తులు ధరించి ఉంటున్నారన్నది అసలైన ప్రశ్న’ అని ఆయన బాఘ్‌పట్‌లో అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ హర్యానాలో పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ లలో పూర్తిచేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News