Tuesday, May 14, 2024

కాబూల్‌లో మరింత డేంజర్

- Advertisement -
- Advertisement -
US warns more attacks in Kabul
మరికొన్ని పేల్లుళ్ల ముప్పు: అమెరికా టీం

వాషింగ్టన్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు ఉగ్రవాద పేలుళ్ల ముప్పు తొలిగిపోలేదు. వచ్చే కొద్దిరోజులలో కాబూల్‌లో మరో ఉగ్రదాడి జరగవచ్చునని అమెరికా జాతీయ భద్రతా బృందం (ఎన్‌ఎస్‌టి) తెలిపింది. ఈ కీలక సమాచారాన్ని దేశాధ్యక్షులు జో బైడెన్‌కు అందించింది. వచ్చే కొద్ది రోజులు కాబూల్‌కు అతి గడ్డు రోజులు అని, ఎప్పుడేమైనా జరగవచ్చునని బైడెన్‌కు నివేదించారు. ఉగ్రవాద దాడులు ఓ పథకం ప్రకారం జరిగే వీలుంది. వచ్చే కొద్ది రోజులలో ఈ టెర్రర్ మిషన్ మరింత ముప్పుగా మారుతుందని తెలిపారు. వైట్‌హౌస్‌లోని తమ ప్రత్యేకమైన సిట్యుయేషన్ రూంలో బైడెన్ దేశ ఉపాధ్యక్షులు కమలా హారిస్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాబూల్‌లో పరిస్థితి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. కాబూల్ ఎయిర్‌పోర్టును టార్గెట్‌గా చేసుకునే తీవ్రస్థాయి దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా బృందం తెలిపింది. ఇప్పటికే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ఎయిర్‌పోర్టు , పరిసరాలలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వివిధ దేశాల వారిని కాబూల్ నుంచి తరలించే క్రమంలో ఎయిర్‌పోర్టు ఇప్పుడు ఉగ్రవాదుల దాడులకు నెలవుగా మారడం అమెరికాను కలవరపరుస్తోంది. గత రెండువారాలుగా అప్ఘనిస్థాన్ నుంచి దాదాపు లక్ష మందిని తరలించారు. ఇప్పటికీ ఇతర దేశాలకు చెందిన వారు అక్కడనే ఉన్నారు. వీరిని రప్పించడం ఇప్పుడున్న పరిస్థితులలో అత్యంత ప్రమాదకరమైనదిగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు అధికార యంత్రాంగానికి హెచ్చరికలు వెలువరిస్తూ వస్తున్నాయి.

ఇప్పటికీ 1,11,000 మంది తరలింపు: పెంటగాన్

అఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటికీ దాదాపుగా 1,11,000 మందిని వారివారి దేశాలకు తరలించినట్లు అమెరికా భద్రతా వ్యవహారాల ప్రదాన కేంద్రం పెంటగాన్ వివరించింది. ఈ నెల 14వ తేదీన తరలింపు ప్రక్రియ ఆరంభం అయింది. తొలికొద్ది రోజులు ఈ ఆపరేషన్ సజావుగా సాగింది. తరువాతి క్రమంలో తాలిబన్లు తమ ఆధికత్యను చాటుకుంటూ పోవడం, ఎయిర్‌పోర్టు వద్ద, కాబూల్ అంతటా రాకపోకలపై నియంత్రణలకు దిగడంతో తరలింపు ప్రక్రియ దెబ్బతింది. శుక్రవారం నాటికి మొత్తం 99 విమానాలలో కాబూల్ నుంచి ప్రజలను తరలించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దాదాపుగా 12,500 మందిని కాబూల్ నుంచి సురక్షితంగా వారివారి దేశాలకు తరలించారని పెంటగాన్ తెలిపింది. ఇప్పటి సంక్షోభ దశలో అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికన్ల సురక్షిత తరలింపు ప్రక్రియ బాధ్యతను మేజర్ జనరల్ హంక్ టేలర్ తీసుకున్నారు. తరలింపు ఓ కీలక సంక్లిష్ట ఆపరేషన్‌గా ఉందని, పలు జాగ్రత్తల నడుమ జనం తరలింపు జరుగుతోందని విలేకరులకు హంక్ టేలర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News