Tuesday, April 30, 2024

ప్రణాళికబద్దంగా వేదవిద్య అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి వేద విద్యను ప్రణాళికబద్దంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో వేద వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేద వర్సిటీలో అడుగుడునా దైవత్వం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలన్నారు. ప్రాంగణంలో వేదిక్, ఆగమ, పౌరోహిత్య హెరిటేజ్ కారిడార్లు ఏర్పాటు చేసి ఆయా అంశాలపై సమాచారాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వర్సిటీలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని, హాస్టల్ భోజనంలో నాణ్యతలో రాజీపడవద్దని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. బ్రాడ్ కాస్టింగ్ ద్వారా నిత్యం వేదమంత్రాలు వినిపించేలా వర్సిటీ ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠ్యాంశాలకు సంబంధించి మరింత ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేదాల రికార్డింగ్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలన్నారు.

వేదాల సారాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు మరింత లోతుగా పరిశోదనలు చేయాలని సూచించారు. విద్యార్ధులకు సాంప్రదాయ సబ్జెక్టులతో పాటు మోడ్రన్ లాంగ్వేజెస్ బోదించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అందుబాటులో ఉన్న దాదాపు రెండు లక్షల పైచీలుకు రాతప్రతుల స్కానింగ్ పనులు ఎస్వీ మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ద్వారా వేగవంతం చేయాలన్నారు. టిటిడి జేఈవో సదా భార్గవి, వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ రాధేశ్యామ్, ఈఈ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News