Monday, April 29, 2024

కాంగ్రెస్‌కు ‘పరివార్‌వాద్’ ముఖ్యం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌కు ‘పరివార్‌వాద్’ ముఖ్యం
అవినీతి, బుజ్జగింపులకు మించి వారికి మరే ఆలోచనా రాదు
వారి అజెండాలో దేశాభివృద్ధికి ఎన్నడూ చోటు లేదు
దేశ భవిత నిర్మాణంపై కాకుండా ప్రభుత్వం స్థాపనపైనే వారి దృష్టి
‘వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ
రాయిపూర్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మహా వృద్ధ పక్షం కాంగ్రెస్ ‘పరివార్‌వాద్’ (ఆశ్రిత పక్షపాతం), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించజాలదని, దేశం అభివృద్ధి ఆ పార్టీ అజెండాలో ఎన్నడూ లేదని ప్రధాని విమర్శించారు. ‘వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో మోడీ వర్చువల్‌గా ప్రసంగిస్తూ, స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిందని, కాని ఆ పార్టీ ప్రభుత్వం స్థాపనపైనే తప్ప దేశ భవిష్యత్ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించలేదని ఆక్షేపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో రూ.34,400 కోట్లకు పైగా విలువ చేసే పది అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. భారత్ రానున్న ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలు అందుకుంటుందని ఆయన సూచించారు. ‘స్వాతంత్య్రానంతరం సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన వారి ఆలోచన భారీగా లేదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోసాగారు.

కాంగ్రెస్ మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చింది కానీ దేశ భవిష్యత్తు నిర్మాణాన్ని మరచింది’ అని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. వారి (కాంగ్రెస్) ఆలోచన ప్రభుత్వం ఏర్పాటుపైనే అని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం వారి అజెండాలో ఎన్నడూ లేదని మోడీ విమర్శించారు. ‘ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ‘దశ దిశ’ గతంలో వలె ఉన్నాయి. పరివార్‌వాద్, అవినీతి, బుజ్జగింపులకు మించి కాంగ్రెస్ ఆలోచించజాలదు’ అని ఆయన ఆరోపించారు. తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును తీర్చిదిద్డడంలో తీరిక లేకుండా ఉన్నవారు ‘మీ కుమారులు, కుమార్తెల’ గురించి ఎన్నడూ ఆలోచించరని మోడీ ఆక్షేపించారు. ‘కానీ మోడీకి మీరంతా మోడీ కుటుంబం. మీ కలల సాఫల్యమే మోడీ తీర్మానం.

అందుకే నేను ఇప్పుడు అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ది చెందిన ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడుతున్నా’ అని మోడీ చెప్పారు. ప్రగతిశీలక ఛత్తీస్‌గఢ్‌ను నిరుపేదలు, యువత, మహిళల సాధికారతతో నిర్మించవచ్చునని ఆయన సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని, అయితే, కొత్త బిజెపి ప్రభుత్వం వాటి నిర్మాణాన్ని వేగవంతం చేసిందని ప్రధాని తెలిపారు. తనను ప్రజల సేవకునిగా మోడీ పేర్కొంటూ, 140 కోట్ల మంది భారతీయులకు తన నిబద్ధతను, శ్రమను గ్యారంటీగా ఇచ్చినట్లు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News