Tuesday, April 30, 2024

జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్లు హవా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్విమ్మర్లు వ్రితి అగర్వాల్, శివాని కర్రా పతకాల పంట పండించారు. ఇద్దరు కలిసి వివిధ కేటగిరీల్లో ఏకంగా పది పతకాలు సాధించడం విశేషం. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగా స్టేడియం వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఆదివారం ముగిసిన ఈ జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ యువ సంచలనాలు శివాని, వ్రితి అగర్వాల్‌లు అసాధారణ ప్రతిభతో అలరించారు. వ్రితి నాలుగు స్వర్ణాలు ఓ రజత పతకం సాధించింది. ఇక శివాని కూడా రెండు స్వర్ణాలు మరో మూడు రజత పతకాలను సాధించింది. మరో స్విమ్మర్ నిత్య సాగి కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. నిత్య రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించింది.

బాలికల విభాగంలో తెలంగాణకు రికార్డు స్థాయిలో 13 పతకాలు లభించడం విశేషం. బాలుర విభాగంలో సుహాస్ ప్రీతమ్ కూడా రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఇక పతకాల పంట పండించిన రాష్ట్ర స్విమ్మర్లు గచ్చిబౌలిలోని స్విమ్మింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. శాట్స్ స్విమ్మింగ్ కోచ్ ఆయూష్ యాదవ్ పర్యవేక్షణలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. కొంతకాలంగా జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో వ్రితి అగర్వాల్, శివాని, నిత్యలు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి టోర్నమెంట్‌లోనూ అత్యంత నిలకైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇదే జోరును కొనసాగించి తెలంగాణ ఖ్యాతిని దేశానికి చాటారు. ఇక అద్భుత ప్రదర్శన చేసిన స్విమ్మర్లను రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తదితరులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News