Tuesday, April 30, 2024

కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో క్లారిటీ ఇస్తాం

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నలకు బిఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి:  బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్
కెఆర్‌ఎంబి పేరుతో కెసిఆర్ ప్రజలను అయోమయం చేస్తున్నారు…
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ప్రకారం ఈఎన్సీ రాజీనామా:  ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని నేడు తిప్పి కొడతాం:  మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ

మనతెలంగాణ/హైదరాబాద్:  కృష్ణా జలాలపై సోమవారం అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామని, అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నలకు బిఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య  అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ నల్లగొండలో మాజీ సిఎం కెసిఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతామన్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఎపికి తరలించారని, ఆ సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

ఎపికి నీళ్ల విషయంలో కెసిఆర్ సాయం చేశారని, జగన్ సైతం అసెంబ్లీలో చెప్పారన్నారు. కెసిఆర్ టీమ్‌కు బుద్ది చెబుతామని ఆయన తెలిపారు. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కెసిఆర్ దిట్ట అని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ రోజు డ్రామాలు చేశారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దోచుకొని ఎన్నికలకు వాడుతున్నారన్నారు. నీతిమాలిన రాజకీయాలు కెసిఆర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఆయన తప్పులు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా కెసిఆర్‌కు అసెంబ్లీ రావడానికి ముఖం చెల్లడం లేదన్నారు. కాళేశ్వరం డబ్బులతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బిఆర్‌ఎస్ చూసిందని, కానీ, జనాలు తమను గెలిపించారని ఆయన తెలిపారు. కృష్ణానది జలాల మీద తాము చర్చకు రెడీ అని, దమ్ముంటే బిఆర్‌ఎస్ నాయకులు చర్చకు రావాలన్నారు.

ఉమ్మడి పాలకుల కంటే కెసిఆర్ మోసం ఎక్కువ: ఆది శ్రీనివాస్
ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణకి ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కెసిఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అన్నారు. జగన్, కెసిఆర్ మాట్లాడుకున్న తర్వాత నాగార్జున సాగర్ పైకి పోలీసులు వచ్చారన్నారు. జగన్, కెసిఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారన్నారు. కెసిఆర్ చేసిన పనుల వల్ల దక్షిణ తెలంగాణ భవిష్యత్‌లో ఎడారిగా మారే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల్లో లబ్ధి కొరకే కెసిఆర్ కృష్ణా జలాలపై పోరాటం అంటూ డ్రామా మొదలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెఆర్‌ఎంబి పేరుతో మరోసారి కెసిఆర్ ప్రజలను అయోమయం చేయడానికి కుట్రలు పన్నారన్నారు. మనప్రాంతం డెడ్ స్టోరేజ్‌లో ఉన్న వాటాను ఆంధ్రప్రాంతానికి కెసిఆర్ దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ప్రకారం ఈఎన్సీని రాజీనామా చేయమని చెప్పామన్నారు. హరీష్‌రావు అబద్ధాలు చెబుతున్నారని రాజకీయ ఎత్తుగడలో భాగంగా బిఆర్‌ఎస్ వాళ్లు నల్లగొండ సభ పెడుతున్నారన్నారు.

జగన్‌తో మాజీ సిఎం కెసిఆర్ కుమ్మక్కు: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ జగన్‌తో మాజీ సిఎం కెసిఆర్ కుమ్మకై తెలంగాణ నీటిని ఎపికి దారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు ఎపిలో జరిగిన అన్యాయం కంటే కెసిఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని నేడు తిప్పి కొడతామన్నారు. నీళ్ల విషయంలో బిఆర్‌ఎస్ నాయకులు అన్ని అబద్ధాలు చెబుతున్నారని, ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కెసిఆర్ లూటీ చేశారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రలో కృష్ణానది జలాలను తెలంగాణ ప్రాంతం ఎంత వాడుకుంది, తెలంగాణ వచ్చిన తరువాత మనరాష్ట్రం ఎన్ని జలాలు వాడుకుందన్న విషయాన్ని తమకు పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ తెలిపారని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు మనప్రాంతానికి నీళ్ల వాటాలో జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టుగా మంత్రులు చూపించారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News