Sunday, April 28, 2024

సంక్షేమ’కారు’డు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా

తెలంగాణ అన్నపూర్ణ, సౌభాగ్యలక్ష్మి

అర్హులకు రూ.5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి
తెల్లకార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5,016..
దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.. రైతుబంధు ఎకరాకు ఏటా రూ.16వేలు
మహిళలకు ప్రతి నెలా భృతి, చౌక ధరకే గ్యాస్ సిలిండర్.. జర్నలిస్టులకూ వర్తింపు
హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, సొంత జాగాలేని
పేదలకు ఇండ్ల స్థలాలు, దళితబంధు సహా అమల్లో ఉన్న పథకాల కొనసాగింపు
అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ఆవిష్కరించిన అధినేత కెసిఆర్

యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారంనాడు ఆవిష్కరించారు. సబ్బండవర్గాల సంక్షేమం, రైతులు, మహిళల ఆర్థిక పురోభివృద్ధికి బంగారు భవిష్యత్‌ను ఆవిష్కరించారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాగానే పేద ప్రజలే కేంద్రంగా అమలు చేయబోయే కొత్త పథకాలను ప్రకటించారు. సరికొత్త సంక్షేమంతో పాటు అదనపు ఆసరా ప్రకటించి విపక్షాలను ఆత్మ రక్షణలో పడేశారు. అడ్డదిడ్డంగా కాకుడా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మేథావులతో మథనం చేసి దానికి అనుగుణంగా పకడ్బందీగా మ్యానిఫెస్టోకు కెసిఆర్ రూపకల్పన చేశారు. మానస పుత్రికలుగా చెప్పుకునే ఆసరా, రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తూనే నూతనంగా ‘కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’ పేరుతో ఓటర్ల మదిలో మేట వేశారు. ఇప్పటికే రైతు పక్షపాతిగా ముద్రవేసుకున్న కెసిఆర్ రైతుబంధు సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించి అన్నదాతల గుండెల్లో గూడును మరింత విస్తరించుకున్నారు. అర్హులైన పేదలకు రూ.5లక్షల జీవిత బీమా కల్పిస్తామని చెప్పి రాష్ట్రంలోని 93లక్షల కుటుంబాలకు కల్పించారు. తెల్లరేషన్ కార్డు దారులకు చౌక ఇప్పుడు పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యానికి స్వస్తి పలికి అన్నపూర్ణ’ పథకానికి రూపకల్పన చేసి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు హామీనిచ్చారు. ఆసరా పింఛన్లపై ఆదరాబాదరాగా కాకుం డా ఆచితూచి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతోంది. ఏకబిగిన కాకుండా పెన్షన్లను ప్రతి ఏటా పెంచుకుంటూ వెళతామని పెన్షనర్లతో పాటు దివ్యాంగుల్లో భరోసా కల్పించారు. ఇక మహి ళలకు కెసిఆర్ మరో ఆర్థిక వరాన్ని ప్రకటించారు. లక్ష్మీ’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుడ తానన్నారు. అర్హులైన ఆడపడుచులందరికీ నెలకు రూ.3000 భృతిని అందించబోతున్నట్లు ప్రకటిం చారు. పేదలకు, గుర్తింపు కార్డు కలిగివున్న జర్నలిస్టులకు రూ.400కే సిలిండర్ సరఫరా చేయనున్న ట్లు హామీనిచ్చారు. ఆరోగ్యంపై ప్రజలకు బిఆర్‌ఎస్ మరింత ధీమా కల్పించింది. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని పెంచుతూ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. ఉద్యోగుల తరహాలోనే పాత్రికే యులకు వైద్య సాయానికి ముందుకొచ్చింది. అగ్రవర్ణాలను సైతం కెసిఆర్ అక్కున చేర్చుకున్నారు. ఆ వర్గాల్లోని పేద పిల్లల చదువుల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున గురుకుల పాఠశాల నెలకొ ల్పుతామన్నారు. లంబాడా, గోండు గూడేలను పంచాయతీలుగా మార్చుతామని చెప్పారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ డిమాండ్‌ను లెక్కలోకి తీసుకొని దాని సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాల ను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, దాన్ని పేదలకు పంచాలనే విధానంతోనే తొలి నుంచి తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని.. ఈసారి కూడా అలాగే చేస్తామన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నామని తెలిపారు. వెనుకబడేయబడ్డ తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలె..- ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ప్రతీ పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం
గతంలో అమలు చేసిన ప్రతి పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం అని ముఖ్యమంత్రి కెసిఆర్ తేల్చిచెప్పారు. ప్ర స్తుతం అమలవుతున్న పథకాల కొనసాగింపు విషయం లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సందర్భోచితం గా పథకాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అనేక విషయాల్లో అగమ్యగోచర పరిస్థితులు ఉండేవని, సాగు, తాగునీరు లేక కరువులతో అల్లాడుతూ, బతుకుదెరువు కోసం దేశం నలుమూలలా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు వలస పోయేవారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోల రూపంలో, ఎన్నికల ప్రణాళిక రూపంలో చెప్పింది 10 శాతం మాత్రమే అని, కానీ ఆచరణ రూపంలో, స్వీయ అనుభావాలను, ప్రజల అవసరాలను బట్టి.. 90 శాతం పథకాలను రూపకల్పన చేసుకున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు, విదేశీ విద్యా స్కాలర్షిప్స్ వంటి వాటిని కేబినెట్ సమావేశంలో నిర్ణ యం తీసుకుని అమలు చేశామని ఉదహరించారు.
మైనార్టీల బడ్జెట్‌ను పెంచుతాం
రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దళితులు, గిరిజనుల, మైనార్టీలు, 50 శాతం జనాభా ఉన్న బిసి కులాల ప్రజల అవసరాలు, ఆశలను దృష్టిలో పెట్టుకుని పని చేశామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. 10 ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీల కోసం రూ. 970 కోట్లు ఖర్చు చేస్తే.. తాము తొమ్మిదిన్నరేండ్లలో రూ.12వేల కో ట్లు ఖర్చు చేశామని అన్నారు.మైనార్టీల బడ్జెట్‌ను పెంచుతామని వెల్లడించారు. మైనార్టీల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా తీర్చదిద్దబోతున్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో ఒక్క సందర్భంలో కూడా అరాచకాలు, మతకల్లోలాలు, వేధింపులు లేకుండా అన్ని మతాల పండుగల ను గౌరవిస్తూ, ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తూ చా లా చక్కగా నిర్వహించుకున్నామని కెసిఆర్ తెలిపారు. గంగా జెమునా తెహజీబ్‌ను కొనసాగిస్తూ సెక్యులర్ స మాజాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఈ తెలంగా ణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో సహకరించిన అన్నివర్గాలకుకెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ మంచి విలువలను నెలకొల్పిందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా దళితబంధు కింద రూ. 10 లక్షల అందజేస్తుందని చెప్పారు. దళిత సమాజం బాగుపడే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం అని కెసిఆర్ స్పష్టం చేశారు.
గిరిజనులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు..
గిరిజనులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పేర్కొన్నారు. తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి, వారే పాలించుకునేలా చేశామని గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతంది అని కెసిఆర్ తేల్చిచెప్పారు.
బిసి వృత్తులను గౌరవించాం..
బిసి కులవృత్తులను గౌరవించామని సిఎం కెసిఆర్ తెలిపారు. చదువుకునే పిల్లలను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ నే కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తగిన ప్రోత్సాహం అందించామని చెప్పారు. గొర్రెల, చేప ల పెంపకం అమలు చేశామన్నారు. బిసిల్లోని కులవృత్తుల వారికి కుటుంబానికి లక్ష చొప్పున కూడా అందించామని, భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని కెసిఆర్ స్పష్టం చేశారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు కెసిఆర్ బీమా
రాష్ట్రంలో రైతు బీమా తరహాలో… తెల్ల రేషన్ కార్డుదారులకు బీమా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. చేనేత కార్మికులకు, గీత కార్మికులకు కూడా బీమా తెచ్చామని, ఈ క్రమంలోనే ఒక కొత్త స్కీం తెవాలని నిర్ణయించామని తెలిపారు. ఎల్‌ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా పథకం తీసుకువసామని అన్నారు. నాలుగైదు నెలల్లో ఈ ప్రక్రియను చేపట్టి పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని కెసిఆర్ భరోసా కల్పించారు. ప్రతి కుటుంబానికి రూ. 3,600 నుంచి 4 వేల రూపాయాలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, అయినా ప్రభుత్వం వెనుకాడటం లేదని తేల్చిచెప్పారు. ఇది కుటుంబంలో ఎవరైనా చనిపోయిన పది రోజుల్లోనే రూ. 5 లక్షలు వచ్చే విధంగా రైతుబీమా తరహాలోనే ఉం టుందని పేర్కొన్నారు.
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ
రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం పంపిణీ చే యాలని నిర్ణయించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్ బియ్యం కోటాను పెంచుకున్నామని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పు డు తెలంగాణలో ఆకలి కేకలు లేవు.. అన్నపూర్ణ రాష్ట్రం గా అవతరించిందని వ్యాఖ్యానించారు. వరి ధాన్యం పండించడంలో తెలంగాణ పంజాబ్‌ను మించిపోయింద ని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కెసిఆర్ ప్రకటించారు. హాస్టల్స్ పిల్లలతో పాటు అంగన్వాడీలో చదువుకునే పిల్లలకు కూడా సన్నబి య్యం అందిస్తున్నామని, అన్నపూర్ణగా తయారైన రాష్ట్రం లో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. రేషన్‌కార్డు కలిగి ఉన్న వారందరికీ వచ్చే ఏప్రిల్, మే నుంచి సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు.ఇక దొడ్డుబియ్యం బాధ ఉండదని, ఈ స్కీంకు ‘తెలంగాణ అన్నపూర్ణ’ అని పేరుపెడుతున్నామన్నారు.
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు
రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి గురుకులాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, గురుకులాల్లో చదువుకునే పిల్లలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ పేదల కోసం కూడా గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని చెప్పారు. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించారు.
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. మహిళా సంఘాల సమాఖ్యలన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయని, బ్యాంకుల నుం చి తీసుకున్న రుణాలు విజయవంతంగా తిరిగి చెల్లిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎంఎల్‌ఎలు స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలకు భవనాలు నిర్మించారని చెప్పారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని ప్రకటించారు,.
అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత
రాష్ట్రంలో అసైన్డ్ భూములను కూడా సాధారణ భూము ల మాదిరిగానే విక్రయించుకునే అవకాశం కల్పిస్తూ, అ సైన్డ్ భూములపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. పట్టాదారుడు అయి తే భూమిని అమ్ముకునే అవకాశం ఉందని, కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న దగ్గర కూడా కోట్ల రూపాయల డి మాండ్ ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. అటువంటి చో ట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొ నుకుంటున్నారని అన్నారు.కానీ అసైన్డ్ భూములు ఉన్న వా రికి అలాంటి సదుపాయం లేదని, ఆ నిబంధనలను సడలించాలని దళిత సోదరులు కోరుతున్నారని చెప్పా రు.
సిపిఎస్ పెన్షన్ విధానంపై అధ్యయన కమిటీ
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్) పరిధిలోని ఉద్యోగులు తమకు గతంలో ఉన్న పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. దీనిపై అధ్యయనం చేయడం కోసం ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ- నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ
రాష్ట్రంలో అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గతంలో అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయించామని గుర్తు చేశారు. అనాథలైన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా ఉత్తమ విధానం తీసుకుస్తామని తెలిపారు.
అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి
బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మ హిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.సౌభాగ్య లక్ష్మిపేరిట తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలకు ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.
ఆసరా పెన్షన్లు రూ. 5 వేలకు…వికలాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంపు
ఆసరా పెన్షన్దారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త వినిపించారు. ప్రస్తుతం రూ. 2 వేలు ఉన్న పెన్షన్ను రూ. 5 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఆసరా పెన్షన్లను రూ. 5 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఇది వెం టనే మరుసటి రోజే ఇవ్వమని… గవర్నమెంట్ వచ్చిన తర్వాత..ఈ స్కీంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి తర్వా త రూ. 3 వేలు చేస్తామని తెలిపారు. అలాగే వికలాంగుల పెన్షన్ను ఇటీవలే రూ. 4 వేలు చేసుకున్నామని, దానిని ఆరు వేల రూపాయాలకు తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రం లో 5 లక్షల 35 వేల కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నారని, మార్చి తర్వాత రూ. 5 వేలకు చేస్తామని ప్రకటించా రు. ప్రతి సంవత్సరం 300 పెంచుకుంటూ.. ఐదో సంవత్సరం నాటికి రూ.6 వేలుచేస్తామనిప్రకటించారు.
రైతుబంధు రూ. 16 వేలకు పెంపు
రాష్ట్రంలో రైతుబంధు కింద ఎకరానికి రూ. 10 వేల చొప్పున అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.16 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారని, వ్యవసాయ రంగం ఎన్నో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల మెట్రిక్ ట న్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. వ్యవసాయ స్థీరీకరణ విజయవంతం చేశామని వ్యాఖ్యానించారు. ఉత్పాదకతను పెంచుకుంటూ వ్యవసాయ రా ష్ట్రంగా భవిష్యత్తులో తెలంగాణ వెలుగొందాలని ఆకాంక్షించారు. రైతుబంధు పథకాన్ని రూ. 16 వేలకు పెంచుతున్నామని, ఇది కూడా మొదటి ఏడాది రూ. 12 వేలు పెరుగుతుందని, ప్రతి ఏడాది కొంత పెరుగతూ ఐదో ఏడాదికి రూ. 16 వేలకు చేరుకుంటుందని చెప్పారు. ఒక పటిష్టమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.
మహిళలకు రూ. 400కే గ్యాస్ సిలిండర్
పెరిగిపోయిన గ్యాస్ సిలిండర్ ధరలతో విలవిలలాడుతున్న సామాన్య ప్రజలకు సిఎం కెసిఆర్ ఊరటనిచ్చే విషయాన్ని ప్రకటించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్దిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామని స్పష్టం చేశా రు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు.. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గినా కూడా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయని మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. అలాగే అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులు ప్రజాసేవలో ఉంటారు కాబట్టి.. రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించామని కెసిఆర్ తెలిపారు.
ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 15 లక్షలకు పెంపు
రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త వినిపించారు. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పమిమితిని రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడే ముందు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇన్సూరెన్స్ రూ. 2 లక్షల వరకు ఉండేదని, తాము దానిని రూ. 5 లక్షలకు తీసుకెళ్లామని చెప్పారు. అనంతరం దానిని రూ. 10 లక్షలకు పెంచాంమని చెప్పారు. తాము జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఏటా 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయి కి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోగ్యశ్రీ గరిష్ఠ పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని నిర్ణయించామని వెల్లడించారు. జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన హెల్త్ స్కీం తరహాలో మరో స్కీం తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఉద్యోగుల కోసం ఇహెచ్‌ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, దానికి సిఎస్ అధ్యక్షత వహిస్తున్నారని అన్నారు. అలాగే ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కూడా రూ. 15లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. దీనికి కెసిఆర్ ఆరోగ్య రక్ష అని తమ పార్టీ వాళ్లు పేరు పెట్టారని వివరించారు.
పేదలకు ఇండ్ల స్థలాలు
రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న డబుల్ బెడ్ రూం, సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకాలను అలాగే కొనసాగిస్తూనే సొంత జాగా లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వెల్లడించారు. బిఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించామని, 11లక్షల మంది నిరాశ్రయులుగా ఉన్నారని తేలిందని చెప్పారు. ప్రతి ఏడాది కొంత మేజర్ అయినవారు విడిపోతారు కాబట్టి ఇండ్లు కట్టివ్వాలని తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు, గృహలక్ష్మి కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున తీసుకుని ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇల్లు లేదన్న బాధపోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి గూడు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీలో మరో లక్ష డుబల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించాలని నిర్ణయించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదల కోసం ఇండ్ల స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని సిఎం హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News