Friday, May 3, 2024

నిజం వెల్లడయ్యేంత వరకు అదానీ గురించి ప్రశ్నిస్తుంట: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: గౌతమ్ అదానీకి సంబంధించిన వాస్తవాలు వెల్లడయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటులో అదానీకి మద్దతుగా బిజెపి నాయకులు వచ్చారని ఆయన విమర్శించారు. భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన తపస్సును ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కొత్త ప్రణాళికను రూపొందించాలని, అందులో దేశం యావత్తు పాల్గొంటుందని, తానూ పాల్గొంటానని అన్నారు. అలాంటిదే మరొకటి చేపట్టనున్నట్లు ఆయన సంకేతం ఇచ్చారు. ఈ సందర్భంగా అదానీపై విరుచుకుపడుతూ అదానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, యావత్ సంపదను పోగుచేసుకుంటున్నాడు అన్నారు. ‘మేము పార్లమెంటులో అదానీ, ప్రధాని మోడీకి ఉన్న లింక్ గురించి మాట్లాడితే మా ప్రసంగాలనే తొలగించారు. అదానీ బాగోతం వాస్తవాలు బయటపడేంత వరకు మేము అడుగుతూనే ఉంటాము. ఆపేదే లేదు’ అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్‌లో ప్రసంగిస్తూ చెప్పారు.

‘అదానీకి నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే..అది ఆయన కంపెనీ దేశాని దెబ్బతీస్తోందని. దేశం యావత్ మౌలిక సదుపాయాలను కాజేస్తున్నాడు’ అని రాహుల్ ఆరోపించారు. ‘ఒకే కంపెనీకి యావత్ దేశ సంపదను కట్టబెట్టడానికి వ్యతిరేకంగా పోరు జరుపుతున్నాం’ అన్నారు.

‘చరిత్ర పునరావృతం అవుతోంది. ఇది దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. ఒకవేళ అదే జరిగితే, కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. అదానీకి ప్రధాని మోడీకి మధ్య ఉన్న సంబంధం గురించి కాంగ్రెస్ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది’ అని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

అవకతవక లావాదేవీలు, షేర్ ప్రైస్ మానిప్యులేషన్ వంటివి అదానీ గ్రూప్ చేసిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. కాగా అదానీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. చట్టానికి కట్టుబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయని సమర్థించుకున్నారు. కానీ వాస్తవం భిన్నంగా ఉంది. ఇప్పటికీ అదానీ కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోతూనే ఉన్నాయి. పతనం ఎక్కడికిపోయి ఆగుతుందో కూడా అంతుపట్టడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News