Tuesday, April 30, 2024

మహిళా అర్చకులు!

- Advertisement -
- Advertisement -

Women priests in Tamilnadu

 

మహిళలను ఆలయ అర్చకులుగా నియమించాలన్న తమిళనాడు డిఎంకె ప్రభుత్వ నిర్ణయం అది అధికారానికి వచ్చినప్పటి నుంచి వేస్తున్న సరికొత్త అడుగుల జాడలోనే ఉన్నది. పురాతన ద్రవిడ సంస్కృతిని పునరుద్ధరించే ఆశయంతో తీసుకున్న నిర్ణయంగా దీనిని పరిగణించాలి. డిఎంకె వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన పాలనలో మహిళా అర్చకుల యోచనను గట్టిగా సమర్థించి ప్రోత్సహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ దానిని ఒక విధాన నిర్ణయంగా తీసుకొని అమలు చేయబోడం అసహజమేమీ కాదు. అయితే స్టాలిన్ తన తండ్రి మాదిరిగానూ పెరియార్ మార్గంలోనూ తనను తాను నాస్తికుడుగా ప్రకటించుకొని మతాలకు వ్యతిరేకిని కానని కూడా చెప్పుకున్న విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవా లి. మతం మనుషుల మధ్య సృష్టించిన తేడాలను తొలగించాలని, అన్ని రంగాల్లోనూ కుల, లింగపరమైన అంతరాలను అంతమొందించాలని డిఎంకె చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగానే ఈ నిర్ణయం వెలువడిందని భావించాలి.

డిఎంకె సామాజిక చింతన గురించి పూర్తి అవగాహనతోనే తమిళనాడు ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు. తద్వారా ఆ రాష్ట్రంలో బిజెపి తీవ్ర హిందుత్వ విధానాలకు చోటు లేదని చాటారు. అర్చకులుగా అన్ని కులాల వారినీ నియమించాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 47 ఆలయాల్లో అర్చక విధులను తమిళంలో నిర్వహిస్తున్నట్టు దేవాలయ శాఖ మంత్రి పికె శేకర బాబు చెప్పారు. అర్చకులు దేవీ దేవుళ్లను ఏ విధంగా కొలుస్తున్నారో, తమ తరపున వారికి ఏమని నివేదిస్తున్నారో పూర్తిగా తెలుసుకునే అవకాశం భక్తులకు కలిగించడాన్ని హర్షించవలసిందే. ఆధ్యాత్మిక పారదర్శకతను స్వాగతించవలసిందే. ఒక ఆలయంలో అర్చకుడు చనిపోడంతో ఆయన కుమార్తె ఆ బాధ్యతలు నిర్వహించడానికి 2008లో మద్రాస్ హైకోర్టు అనుమతించింది. ఆ గుడిలో అర్చకురాలు విధులు నిర్వహించడం చట్ట సమ్మతమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఆలయ దైవమే అమ్మవారుగా మహిళ రూపంలో ఉన్నప్పుడు అక్కడ అర్చకురాలు ఉండడానికి అభ్యంతరమేమిటని ఆ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ చంద్రు అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠాపన కాని ఆలయాల్లో మహిళలను అర్చకులుగా నియమించడానికి అభ్యంతరం లేదని, పురాతన కాలంలో నెలకొల్పిన కొన్ని తప్ప ఇప్పటి గుడులన్నీ ఆగమమేతరమైనవేనని ఆయన ఒక మెలిక పెట్టారు. ఇప్పుడాయన విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం అమలుకు అడ్డంకులుండవని చెప్పారు. ఆగమ శాస్త్రం లో శిక్షణ పొందిన వారు ఎవరైనా స్త్రీ అయినా, పురుషుడైనా అర్చకత్వానికి అర్హులని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎంతటి రాజ్యాంగ విహితమైనప్పటికీ, మరెంత చట్టబద్ధమైనప్పటికీ శతాబ్దాలుగా సమాజంలో పాతుకుపోయిన పద్ధతికి విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలు సునాయాసంగా విజయవంతం కావు.

కేరళ శబరిమల ఆలయంలోకి ‘నెలసరి’ వయసులోని స్త్రీల ప్రవేశాన్ని సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ సంఘ పరివార్ శక్తులు వీరావేశంతో మోహరించి ఆ నిర్ణయం అమలు కాకుండా బలంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడి వామపక్ష కూటమి ప్రభుత్వం కూడా కళ్లప్పగించి ప్రేక్షక పాత్ర వహించిందేగాని తగినంత కట్టుదిట్టమైన రక్షణ కల్పించి మహిళా భక్తులు గర్భగుడిలో ప్రవేశించేలా దారి చేయలేకపోయింది. తమిళనాడులోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ అరుదుగా మహిళలు, దళితులు అర్చకులుగా ఉన్నారు. అయితే వారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత టా ఆలయాల్లో అన్ని కులాలవారిని, మహిళలను అర్చకులుగా నియమించాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంప్రదాయంగా ఒక ‘ఉన్నత’ సామాజిక వర్గానికే పరిమితంగా ఉంటున్న ఈ వృత్తిపై వారి గుత్తాధిపత్యాన్ని బద్దలు చేస్తుంది. అంతేకాదు ఇందుకు సంబంధించి పాతుకుపోయి ఉన్న విశ్వాసాలకు కొంత మేరకు విఘాతం కలుగుతుంది.

అందుచేత ఈ నిర్ణయం అమలు అంత సులభసాధ్యం కాకపోవచ్చు. కాని ద్రవిడ సంస్కృతి మీద ప్రేమ తో ప్రజలిచ్చిన అధికారం స్టాలిన్ ప్రభుత్వానికి అండగా ఉంటుందని భావించవచ్చు. రామస్వామి నాయకర్ (పెరియార్) మహోద్యమం తమిళనాట తీసుకు వచ్చిన చైతన్యం కూడా ఈ నిర్ణయం అమలుకు తోడ్పడవచ్చు. విచిత్రంగా దళితుడైన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు డా.మురుగన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పురాతన తమిళ సంస్కృతి అన్ని కులాల అర్చకులను అనుమతించిందని ఆయన అన్నారు. మహిళా అర్చకుల సంప్రదాయం తమిళ సంస్కృతిలో అంతర్భాగమని, ఆర్యులు దానిని ధ్వంసం చేశారని సత్యబాబా ట్రస్ట్‌కు చెందిన సత్యభామా అమ్మయార్ ప్రకటించారు. ఏ వృత్తి లేదా వ్యాపకం లేదా విద్య ఏ ఒక్క వర్గం గుప్పెట్లోనో బందీగా ఉండడం అభ్యుదయ సమాజంలో ఎంతమాత్రం హితవు కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News