Sunday, April 28, 2024

ముక్కోణపు టి20 సిరీస్: ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో భారత్ చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అఖరికి రన్నరప్‌తోనే సరి పెట్టుకోక తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత మహిళా జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలి వర్మ (10)ను వ్లయ్‌మిక్ వెనక్కి పంపింది. అప్పటికీ భారత్ స్కోరు 11 పరుగులు మాత్రమే. అయితే మరో ఓపెనర్ స్మృతి మంధాన తన జోరును కొనసాగించింది. మంధానకు రిచా ఘోష్ అండగా నిలిచింది. ఇద్దరు కలిసి స్కోరును ముందుకు నడిపించారు. మంధాన తన మార్క్ షాట్లతో అలరించింది.

అయితే రెండు ఫోర్లతో 17 పరుగులు చేసిన రిచాను సదర్లాండ్ ఔట్ చేసింది. ఆ వెంటనే స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ (2) కూడా పెవిలియన్ చేరింది. ఈ వికెట్ వ్లయ్‌మిక్‌కు దక్కింది. దీంతో భారత్ 65 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మంధాన తన జోరును కొనసాగించింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అండగా నిలిచింది. చెలరేగి ఆడిన మంధాన 37 బంతుల్లోనే 12 ఫోర్లతో 66 పరుగులు చేసింది. అయితే జోరుమీదున్న మంధానను మెగాన్ స్కట్ వెనక్కి పంపించింది. ఆ తర్వాత జెస్ జొనాసెన్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయింది. ఆము ధాటికి భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. అద్భుత బౌలింగ్‌ను కనబరిచి జొనాసెన్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 144 పరుగుల వద్దే ముగిసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్ బెత్ మూని ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మూని స్కోరును పరిగెత్తించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూని 9 ఫోర్లతో 54 బంతుల్లోనే 71 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. గార్డ్‌నర్ (26), కెప్టెన్ మెగ్ లానింగ్ (26) ఆమెకు అండగా నిలిచారు. చివర్లో రచెల్ హేన్స్ వేగంగా 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 155 పరుగులకు చేరింది. జొనాసెన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా మూని నిలిచింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో మూడో జట్టుగా ఇంగ్లండ్ పాల్గొంది. మహిళల టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని నిర్వహించారు.

Womens T20 Tri Series: AUS wins by 11 runs against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News