Tuesday, April 30, 2024

రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాహుల్‌కు త్వరగా పెళ్లి చేయండి అంటూ తనను కోరిన హర్యానాకు చెందిన మహిళా రైతులకు మీరే అమ్మాయిని చూసి పెట్టండి అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు రాహుల్ “అది జరుగుతుంది” అంటూ సమాధానమిచ్చారు. ఈ సంభాషణంతా శనివారం సోనియా గాంధీ తన నివాసంలో హర్యానా మహిళా రైతులకు ఇచ్చిన విందు సమావేశంలో చోటుచేసుకుంది.

ఇటీవల హర్యానాలోని సోనీపట్ జిల్లాను సందర్శించిన రాహుల్ గాంధీ మహిళా రైతులను కలుసుకున్న సందర్భంగా తన నివాసంలో విందు ఏర్పాటు చేస్తానని వారికి వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం సోనియా గాంధీ వారికి మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. వారితో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు రాహుల్‌కు త్వరగా పెళ్లి చేయండి అని సోనియాను కోరారు. ఇందుకు సోనియా మీరే రాహుల్‌కు అమ్మాయిని చూడండి అని జవాబిచ్చారు. రాహుల్ జోక్యం చేసుకుంటూ అది జరుగుతుంది అంటూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఒక మహిళా రైతు రాహుల్‌కు అన్నం ముద్ద తినిపించడం విశేషం. రాహుల్ తనకన్నా చాలా ఎక్కువ అల్లరి చేస్తాడని, కాని తానే తిట్లు తింటుంటానని ప్రియాంక గాంధీ మహిళా రైతులకు ఫిర్యాదు చేశారు.

జులై 8న సోనిపట్‌లోని మదీనా గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన రాహుల్ గాంధీ గ్రామస్తులతో ముచ్చటించడంతోపాటు పంట పొలాలలో పనిచేస్తున్న రైతులను పలకరించారు. వరినాట్లు వేయడంలో పాలుపంచుకున్న రాహుల్ పొలంలో ట్రాక్టర్ నడిపారు. మహిళా కార్మికులు తెచ్చుకున్న ఆహారాన్ని వారితో కలసి తన్న రాహుల్ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోనే నివసిస్తున్నప్పటికీ తాము ఇంతవరకు దేశ రాజధాని చూడలేదని వారు చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యపోయారు. వారికి ఢిల్లీ దర్శనం చేయిస్తానని రాహుల్ వాగ్దానం చేశారు. తన సోదరి ప్రియాంక గాంధీతోకూడా ఫోన్‌లో మాట్లాడించారు. మీ ఇంటికి పిలిస్తే భోజనానికి వస్తామని మహిళా రైతులు చెప్పడంతో వారిని తన ఇంటికి ప్రియాంక ఆహ్వానించారు.

“ఈ రోజు అమ్మకు, ప్రియాంకకు, నాకు గుర్తుండిపోయే రోజు. కొతమంది ప్రత్యేక అతిథులతో మేము గడిపాము. సోనిపట్‌కు చెందిన రైతు సోదరీమణులకు ఢిల్లీ దర్శన్ జరిగింది. వారితో కలసి మా ఇంట్లో భోజనం చేశాము..ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. పల్లె నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో చేసిన పచ్చళ్లు, అమిత ప్రేమ వంటి అమూల్యమైన బహుమతులు లభించాయి” అంటూ రాహుల్ శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో హిందీలో రాశారు. మహిళా రైతులతో తన సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

సోనిపట్‌కు చెందిన మహిళా రైతులను ఢిల్లీకి తీసుకెళ్తానని రాహుల్ మాటిచ్చారు. రైతు సోదరీమణులు ఢిల్లీకి వచ్చారు. రాహుల్ తన వాగ్దానాన్ని నెరవేర్చారు అంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News