Thursday, September 25, 2025

రిహాబిలిటేషన్ సెంటర్‌లో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒకే రూంలో ఉంటున్న తోటి వ్యక్తులు అతనిని కిరాతకంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఫా రిహాబిలిటేషన్ సెంటర్‌లో గురువారం జరిగింది. సిఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన సందీప్ (38) డ్రగ్స్‌కు బానిస కావడంతో ఎనిమిది నెలల క్రితం కుటుంబ సభ్యులు అతనిని మియాపూర్ నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీలో ఉంటున్న రాఫా డ్రగ్స్ పునరావాస కేంద్రానికి చికిత్స నిమిత్తం పంపారు. అక్కడే ఉంటూ కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న నల్గొండకు చెందిన ఆదిల్, నగరంలోని బార్కాస్‌కు చెందిన సులేమాన్‌తో కలిసి సందీప్ ఒకే రూంలో ఉంటున్నాడు. తరుచూ ఏదో ఒక గొడవ పడడంతో సులేమాన్, ఆదిల్ సందీప్‌పై కోపం పెంచుకున్నారు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ముగ్గురి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న వారిద్దరూ సందీప్‌ను వారు ఉంటున్న పునరావాస కేంద్రం కిచెన్ పక్కనే ఉన్న బాల్కానీలోకి తీసుకెళ్లి కట్టెలు, నెయిల్ కట్టర్ సహాయంతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సందీప్ కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం అతనిని సమీపంలోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే సందీప్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డ సులేమాన్, ఆదిల్‌ను అదుపులోకి తీసుకొన్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News