Saturday, April 27, 2024

ఎటిఎంలో డబ్బులు కొట్టేస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఎటిఎంలో డబ్బులు కొట్టేస్తున్న ఇద్దరి అరెస్టు
సెక్యూర్‌వ్యాల్యూలో కస్టోడియన్‌గా పనిచేస్తున్న నిందితుడు
పాస్‌వర్డ్, కీస్ చోరీ చేసి రూ.65,29,000 కొట్టేసిన నిందితులు
ఇద్దరిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఎటిఎం కస్టోడియన్‌గా పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఓ యువకుడు, అతడికి సహకరించిన మరో యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.55,80,000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, రెండు స్మార్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం, మొగిలిచర్ల గ్రామానికి చెందిన పత్రి ప్రణయ్ కుమార్ సికింద్రాబాద్‌లోని సెక్యూర్‌వ్యాల్యూ ఇండియా లిమిటెడ్‌లో రెండేళ్ల నుంచి కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు.

పోతరాజుపల్లికి చెందిన దొమ్మాటి క్రాంతికుమార్ కూలీ పనిచేస్తున్నాడు. ఉప్పల్ పరిధిలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఎటిఎంలకు మరో వ్యక్తి శ్రీనివాస్‌తో కలిసి కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. ఎటిఎంలో క్యాష్ నింపేందుకు ఒకరి వద్ద కీ ఉంటే, మరో కస్టోడియన్ వద్ద పాస్‌వర్డ్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఎటిఎంలో క్యాష్ లోడ్ చేస్తుంటారు. మే,31, 2023న కస్టోడియన్ శ్రీనివాస్ కలిసి ఎటిఎంలో క్యాష్ లోడ్ చేయాల్సి ఉంది. కానీ శ్రీనివాస్ జూన్ 1వ తేదీన విధులకు రాకపోవడంతో ప్రణయ్ ఆఫీస్‌కు వెళ్లి ఎటిఎం పాస్‌వర్డ్‌ను తన మొబైల్ ఫోన్ ద్వారా ఫొటో తీసుకున్నాడు. వెంటనే ఫీర్జాదిగూడ, బండ్లగూడ, జీడిమెట్ల ఎటిఎంల్లోని రూ.62,79,000 తీసుకుని పారిపోయాడు.

అప్పటి నుంచి విధులకు రావడం మానివేశాడు. మరుసటి రోజు క్యాష్ నింపేందుకు వెళ్లిన రెండో కస్టోడియన్ క్యాష్‌లో తేడా రావడంతో వెంటనే సెక్యూరావ్యాల్యూ ప్రతినిధులకు విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని విచారించగా గతఏడాది నవంబర్, 2022లో ఉప్పల్, పోచారం పరిధిలోని ఎటిఎంల్లో రూ.2,50,000 చోరీ చేసినట్లు బయటపెట్టాడు. రెండేళ్ల నుంచి పనిచేస్తున్నా వేతనం రూ.18,000 ఇస్తున్నారని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే డబ్బులు చోరీ చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. చోరీ చేసిన డబ్బులను దొమ్మాటి క్రాంతి కుమార్ వద్ద దాచినట్లు చెప్పాడు. మేడిపల్లి ఇన్స్‌స్పెక్టర్ గోవర్ధనగిరి, ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, నర్సింగరావు,లక్ష్మణ్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News