Friday, April 26, 2024

దారుణమారణ ఎత్తుగడ

- Advertisement -
- Advertisement -

22 jawans killed in Maoist firing

 

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత కాలం సాగుతుంది, సభ్య సమాజానికి దూరంగా చెట్లను, పుట్టలను ఆశ్రయించి బతికే ఆదివాసీ జన జీవనం దశాబ్దాల తరబడి వ్యథాభరితమవుతున్న ఈ దుస్థితికి అంతం లేదా? బలగాలు, మావోయిస్టులు ఎవరు ఎంతటి బలవంతులనేదాని కంటే ఎత్తుగడల్లో ఎవరిది పై చేయి అనేదే కీలకమవుతున్నది. ప్రభుత్వాలకున్న భద్రతా దళాల సంఖ్య ముందు మావోయిస్టులెంత? కాని ఇంతింత మంది జవాన్లను మట్టుబెడుతూ వారెందుకిలా పేట్రేగగలుగుతున్నారు? శనివారం నాటి మావోయిస్టుల కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందారు, మరి కొంత మంది గాయపడ్డారు. మావోయిస్టుల చేతికి ఇంకొంత మంది చిక్కి ఉండవచ్చని అంటున్నారు. ఈ రెండు రకాల బాధిత జవాన్లు కలిసి 35 మంది ఉంటారని చెబుతున్నారు.

అధునాతన ఆయుధాలు, ఆత్మరక్షణ సామగ్రి దండిగా ఉండే ప్రభుత్వ దళాలు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు బలి కావడం ఆందోళన కలిగించే అంశం. దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం ప్రాణాలకైనా తెగించి పాటుపడే విశిష్ట విధి నిర్వహణలోని ఇంత మంది జవాన్లు ఇలా బలి కావడం జాతికే సవాలు. మరణించిన జవాన్లు ఐదుగురేనని శనివారం రాత్రి వెలువడిన వార్త ఉన్నంతలో ఊరట కలిగించింది. ఆదివారం ఉదయం మరి 17 మంది జవాన్ల మృత దేహాలు పడి ఉండడం దిగ్భ్రాంతి గొల్పింది. గాయపడి నేలకొరిగిన తర్వాత రక్తం అపరిమితంగా కోల్పోయిన కారణంగా వీరిలో పలువురు మరణించి ఉంటారని అంటున్నారు. వారిని సకాలంలో ఆదుకోలేకపోడం స్పష్టంగా కనిపిస్తున్నది. అదనపు బలగాలతో వెళ్లిన హెలికాప్టర్ కూడా అక్కడ కొనసాగుతున్న కాల్పుల మధ్య కిందికి దిగలేకపోయిందని వార్తలు చెబుతున్నాయి. అంటే పోరాటం జరుగుతున్న ప్రాంతం మీద జవాన్లకు సరైన అవగాహన లేని పరిస్థితి వెల్లడవుతున్నది. తమ బలగాల్లో ఎంత మంది చనిపోయారో, మరెంత మంది సజీవంగా ఉన్నారో కొన్ని గంటల తర్వాత గాని తేల్చుకోలేకపోయిన అయోమయ స్థితి.

అది మావోయిస్టుల చోటు, అక్కడి అనుపానులు వారికి తెలిసినంతంగా బయటి వారికి తెలిసే అవకాశం లేదు. వారి కోసం గాలింపు ఇటీవల నిరంతరాయంగా సాగుతున్నది. ఇందులో చత్తీస్‌గఢ్‌కు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు (డిఆర్‌జి), స్పెషల్ టాక్స్‌ఫోర్స్ పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీసు దళాలకు చెందిన బస్తర్ బెటాలియన్ వంటి వివిధ దళాలు పాల్గొంటున్నాయి. దక్షిణ బస్తర్‌లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టడానికి ఈ బలగాలు వెళ్లినప్పుడు ఈ విషాదకర ఘటన సంభవించింది. మావోయిస్టులలో పేరున్న వ్యూహకర్త, పెద్ద పెద్ద దాడులకు సునాయాసంగా నాయకత్వం వహించగల వాడు అని చెబుతున్న హిడ్మా అనే నాయకుడు అడవుల్లోకి వచ్చాడు అనే సమాచారాన్ని వ్యాపింప చేసి పోలీసులను అక్కడికి రప్పించడంలో వారు కృతకృత్యులయ్యారని సమాచారం. ఆ విధంగా ఒక పథకం ప్రకారం పోలీసులను భారీ సంఖ్యలో రప్పించి వారిలో 150 మందితో కూడిన ఒక దళాన్ని మిగతా బలాల నుంచి వేరు చేసి ఆంగ్ల U ఆకారంలో వారిని ముట్టడించి మావోయిస్టులు ఈ మారణకాండ జరిపించారని తెలుస్తున్నది. గాలింపు జరపదలిచిన ప్రాంతం గురించి ముందుగా వివరమైన సమాచారాన్ని సేకరించకుండా బలగాలు తొందరపడి ముందడుగు వేసి వారి ఉచ్చులో చిక్కుకున్నాయనిపిస్తున్నది.

ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మావోయిస్టులు బలి తీసుకున్న ఘటనలు దండకారణ్యంలో గతంలోనూ జరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా సుక్మా వద్ద ఇటువంటిదే ఒక దారుణ ఎన్‌కౌంటర్ సంభవించింది. అందులో 19 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2010లో చత్తీస్‌గఢ్‌లోని చింతల్ నార్ ప్రాంతంలో 76 మంది సిఆర్‌పిఎఫ్ దళాలను మావోయిస్టులు బలి తీసుకున్నారు. ఒకసారి జరిగితే అది వేరు సంగతి, పదే పదే భారీ సంఖ్యలో జవాన్లు ఎందుకిలా బలి అవుతున్నారు? జరిగిన దానికి ప్రతీకారంగా మావోయిస్టులను అధిక సంఖ్యలో కాల్చివేస్తే అంతమైపోయే సమస్య కాదిది. బహుముఖమైన వ్యూహంతో వారిని అక్కడి సాధారణ ఆదివాసీ జనం నుంచి శాశ్వతంగా దూరం చేయగలగాలి. గతంలో చేపట్టిన సల్వాజుడుం ప్రయోగం విఫలమైంది. తగిన బహుముఖీనమైన, విజ్ఞతాయుతమైన ప్రణాళికతో ఈ సమస్యకు తెర దించడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు గట్టిగా తలచుకోవాలి. నీరింకిన చెరువులో మొసళ్లు మెసలలేవు, అలాగే ఆదివాసీల ఆదరణ లభించని వాతావరణాన్ని సృష్టించగలిగితే మావోయిస్టులు అక్కడ ఊపిరి పీల్చుకోలేరు. అందుచేత కేవలం బలగాల మీదనే ఆధారపడకుండా ఇతరేతర కోణాల్లోనూ ప్రతి వ్యూహ రచన జరగాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News