Sunday, May 5, 2024

ఆ రైతులకు 300 గజాల నుంచి 600 గజాల స్థలం

- Advertisement -
- Advertisement -

అసైన్డ్ భూములు అనుభవిస్తున్న రైతులకు
300 గజాల నుంచి 600 గజాల స్థలం
విధి, విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం
మిగతా స్థలం వెంచర్‌లుగా…
ఇప్పటికే పలు జిల్లాలో భూముల గుర్తింపు

Drought and water scarcity due to desertification

 

 

 

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా 141 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను వెంచర్‌లుగా చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అసైన్డ్ భూములను అనుభవిస్తున్న రైతులు, ప్రభుత్వం లబ్ధిపొందేలా అధికారులు విధి, విధానాలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే అసైన్డ్ భూముల సమగ్ర సమాచారాన్ని సేకరించి జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లా, కరీంనగర్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసైన్డ్ భూములను అనుభవిస్తున్న రైతులతో అధికారులు మాట్లాడి అందులో నుంచి 300 గజాల నుంచి 600 గజాల వరకు ఇస్తామని పేర్కొన్నారు. దీనికి కొన్ని ప్రాంతాల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాలను బట్టి రైతులకు అన్యాయం జరగకుండా ముందుకెళ్లాలని అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి, విధానాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం ఆ భూములను ఎవరు అనుభవిస్తున్నారు ?

అసైన్డ్ లబ్ధిదారుల వివరాలు, ప్రస్తుతం ఆ భూములను ఎవరు అనుభవిస్తున్నారు, ఏ పంటలను సాగు చేస్తున్నారు, సాగు చేయకపోతే వాటి తాజా పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల్లో కలెక్టర్‌లు పొందుపరిచారు. ఈ భూముల్లో అక్రమంగా నిర్మాణాలేమైనా చేపడితే వాటి వివరాలు, మునిసిపాలిటీకి ఎంత దూరంలో ఉన్నాయి. వీటి సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ, లేదా ప్రైవేటు సంస్థలు, కంపెనీలు ఏర్పాటు చేస్తే వాటి వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ భూముల సమీపంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా కేంద్రాలను కలిపే రోడ్డు మార్గాల వివరాలు, ఇతర వసతుల గురించి కూడా ఇందులో పేర్కొన్నారు.

చదరపు గజానికి రూ.8 వేల నుంచి రూ.26 వేల ధర

అసైన్డ్ భూములను లేఔట్ చేస్తే తమకు పరిహారం కింద లే ఔట్‌లో కొంత స్థలం కేటాయించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని వెంచర్‌లుగా చేస్తే ఆ భూములను అనుభవిస్తున్న వారికి 300ల నుంచి 600 గజాల స్థలం వరకు వారికి పట్టా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి అది ఎంత స్థలం అన్నది తెలిసే అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ లే ఔట్లకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. ఇంటిస్థలాలు, లే ఔట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పురపాలికల్లో ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాల పరిధిలోని పురపాలికల్లో చదరపు గజానికి రూ.8 వేల నుంచి రూ.26 వేల ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే అసైన్డ్, ప్రభుత్వ భూముల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపడితే ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లే ఔట్లకు అనుమతి ఉన్నా, లేకపోయినా బహిరంగ మార్కెట్‌లో వాటిలోని ఇళ్ల స్థలాలు అమ్ముడుపోతున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో లే ఔట్లు వేస్తే మంచి ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అక్రమ లే ఔట్లకు చెక్ పెట్టేలా…

అసైన్డ్ భూములను వెనక్కి తీసుకునే బదులు వాటిని వెంచర్‌లుగా చేసి అమ్మితే అక్రమ లే ఔట్లకు చెక్ పెట్టడంతో పాటు అధిక సంఖ్యలో వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. అర్బన్ లే ఔట్ల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వమే స్వయంగా వెంచర్లు ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ లే అవుట్లకు చెక్ పెట్టవచ్చని, మరోవైపు పక్కా లే ఔట్ల ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తూ ఇంటి స్థలాలను విక్రయించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ భూములన్నీ మునిసిపాలిటీ కేంద్రాలకు ఐదు కిలోమీటర్లలోపే ఉండటంతోపాటు వీటి చుట్టుపక్కల పట్టా భూముల్లో చేసిన వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బాగా ఉన్న ప్రాంతాలను మొదటిదశలో ఎంపిక చేసి అక్కడ అర్భన్ లే ఔట్లు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News