Tuesday, May 7, 2024

దేశంలో మరో హైరానా: బ్లాక్ ఫంగస్‌ తోడుగా వైట్ ఫంగస్..

- Advertisement -
- Advertisement -

కరోనా తోడుగా మరో హైరానా..  దేశంలో వైట్ ఫంగస్ ముప్పు
పాట్నాలో నాలుగు కేసులు
కరోనా టైప్ లక్షణాలు, బలహీనత ఉంటే అటాకే

న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ వ్యాధితో పాటు ఇప్పుడు కొత్తగా వైట్ కూడా దేశంలో తలెత్తింది. ఇది బ్లాక్ ఫంగస్ కన్నా అత్యంత ప్రమాదకారి అని వైద్యులు తెలిపారు. కరోనా తీవ్రత లేదా కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వారి రోగనిరోధక శక్తి మేరకు బ్లాక్ ఫంగస్‌లు తలెత్తి ప్రాణాంతకం అవుతున్నాయి. ఇప్పుడు దీనికి తోడుగా వైట్ ఫంగస్ కూడా వెలుగులోకి వచ్చింది. వైద్య నిపుణులు ఈ ఫంగస్ గురించి పలు హెచ్చరికలు వెలువరించారు. బ్లాక్ ఫంగస్ లేదా ముకోర్మికోసిస్ ఇప్పటికైతే ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రలలో చాపకింద నీరులాగా విస్తరించింది. ఇప్పుడు బీహార్ రాజధాని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ఈ నలుగురిలో పాట్నాకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు కూడా ఉన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుడు బ్లాక్ నియంత్రణకు చికిత్సకు పలు రకాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు వచ్చి పడ్డ వైట్ ఫంగస్‌కు కూడా తాజాగా మార్గదర్శకాలు నిర్ధేశించుకోవల్సి ఉంది. బ్లాక్ ఫంగస్ లాగా కాకుండా వైట్ ఫంగస్ మనిషికి సోకితే శరీరంలోని అన్ని భాగాలను చివరికి గోళ్లను, చర్మాన్ని, కడుపును, కిడ్నీని, మెదడును, చిట్టచివరికి మనిషి రహస్యాంగాలను , నోటిని కూడా దెబ్బతీస్తోంది. వైట్ ఫంగస్‌కు సంబంధించి కేసుల వివరాలను పాట్నాకు చెందిన మైక్రోబయాలజీ విభాగం అధినేత డాక్టర్ సింగ్ తెలిపారు. పాట్నాలో ఈ వైట్‌ఫంగస్ సోకిన రోగులలో కరోనాను పోలిన లక్షణాలు ఉన్నాయని తెలిపారు. అయితే వీరికి అంతకు ముందు కరోనా సోకిన దాఖలాలు లేవని వివరించారు.
ముందు వీరికి కరోనా వచ్చిందనుకుని పరీక్షలు నిర్వహించగా అది లేదని నిర్థారణ అయింది. అయితే తరువాతి పరిశీలనలో వీరికి వైట్ ఫంగస్ ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికైతే వీరికి నయం అయింది. అయితే ఇతర చోట్ల ఎక్కడైనా ఇటువంటి ఫంగస్ రోగులు ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. వైట్ ఫంగస్ సోకితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీనిని ముందుగానే గుర్తించేందుకు హెచ్‌ఆర్‌సిటి పరీక్షలు అవసరం. ఇప్పటి వైరస్ ఓ చెడ్డరోగం, బహురూపం అయిందన్నారు.
అతి పేలవ ఇమ్యూనిటి ఉంటే వైట్ ఫంగస్ దాడి
బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ తీవ్రస్థాయిది అని తేల్చిచెప్పిన డాక్టర్లు అత్యంత తక్కువ స్థాయి రోగనిరోధక శక్తి ఉన్న వారికి ఇది సంక్రమిస్తుందని తెలిపారు. కొవిడ్ దీనికి తోడు షుగర్ ఇతరత్రా వ్యాధులు ఉన్న వారు తక్కువ స్థాయి ఇమ్యూనిటి ఉన్న వారిలో ఈ ఫంగస్ వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. రోగికి వివిధ సమయాలలో చికిత్సకు వాడే వైద్య ఆక్సిజన్ సంబంధిత యంత్రాలు పరిశుభ్రంగా ఉండాలి. ప్రత్యేకించి బ్యాక్టీరియాలేకుండా చేసుకుని తీరాలి. లంగ్స్‌లోకి వెళ్లే ఆక్సిజన్‌లో ఫంగస్ ఏ స్థాయిలో వెళ్లినా అది అత్యంత ప్రమాదకరం అవుతుందని, ఇది శ్వాసను దెబ్బతీస్తుందని నిపుణులు తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలు, వైట్ ఫంగస్ లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అత్యంత క్లిష్టమైన పరీక్షల ప్రక్రియలతోనే వైట్ ఫంగస్‌ను గుర్తించేందుకు వీలేర్పడుతుందని తెలిపారు.

4 White Fungus Cases Reported in Patna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News