Saturday, April 27, 2024

నగరం నడి బొడ్డున ఆది మానవుని ఆనవాళ్లు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని బిఎన్‌ఆర్ హిల్స్‌లో తాబేలు గుండు కింద కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు, పరిశోధకుల, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా శనివారం బిఎన్‌ఆర్ హిల్స్‌లో దారిలో ఉన్న తాబేలు గుండును పరిశీలిస్తుండగా, గుండు కింద నేల పరుపు సందులో రెండు కొత్త రాతి యుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని పేర్కొన్నారు. సులువుగా ఆహార సంపాదన కోసం నైపుణ్యాలతో తయారు చేసుకున్న ఈ రాతి గొడ్డళ్లు కొత్త రాతియుగపు మానవుల సాంకేతిక ప్రగతిని తెలియజేస్తున్నాయనీ, చుట్టూ ఉన్న నీటి వనరులతో వ్యవసాయం, పశుపాలన ముఖ్య వృత్తులుగా నాటి మానవులకు తాబేలు గుండు తాత్కాలిక నివాస స్థావరమన్నారు.

Also Read: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కోదండరామ్ భేటీ

నల్ల శానపు రాతి చుట్టూ పెచ్చులు తీసి, త్రిభుజాకారంగా చేసి, పైన పట్టుకోవడానికి వీలుగా సన్నగా చేసి కింది భాగాన్ని నునుపుగా కొనదేలేటట్లు అరగదీశారని, పాత రాతియుగపు గొడ్డళ్లు కంటే ఇవి మొనదేలి ఉండి మెరుగైన పనితనాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. పెద్దది 12 సెం.మీ పొడవు, 7.2 సెం.మీ వెడల్పు, 2.1 సెం.మీ మందంతో, చిన్నది 9.2 సెం.మీ పొడవు, 3.9 సెం.మీ వెడల్పు, 2.2 సెం.మీ మందం కలిగి ఉన్నాయని, ఇవి క్రీ.పూ. 40002000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి, తద్వారా హైదరాబాద్ నగరానికి 6వేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుందని వారు వెల్లడించారు.

ఒకవైపు రెండు, మరోవైపు ఒకటి 6 అడుగుల ఎత్తున మూడు బండలపై 20 అడుగుల పొడవు, 15 అడుగల వెడల్పు, 10 అడుగుల ఎత్తున్న ఈరాతి ఆవాసంలో ఒకేసారి 20 మంది నివసించే అవకాశముందన్నారు. సహజసిద్ధమైన ట్రాఫిక్ ఐలాండ్‌గా ఉన్న, పురావస్తు ప్రాధాన్యత గల ఈ తాబేలు గుండును కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలని కాలనీ వాసులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News